గొర్రు పట్టిన కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్..

గొర్రు పట్టిన కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్..

విత్తనాలు వేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

యాంత్రీకరణతో సాగు ఖర్చులు తగ్గించుకోవాలి.. రైతు పొలంలో సీడ్ డ్రిల్ నడిపిన కలెక్టర్, ఎమ్మెల్యే

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ సూచించారు.

రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం శివపురం గ్రామంలో రైతు ఈడిగ వన్నూరప్ప వ్యవసాయ పొలాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మమేకమై సాగు పరిస్థితులను తెలుసుకున్నారు.

వన్నూరప్ప పొలంలో సాగు పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా విత్తనం గొర్రు (సీడ్ డ్రిల్) పట్టి ఆముదాల విత్తనాలను విత్తారు. వ్యవసాయ పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొని రైతులకు ప్రోత్సాహం అందించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా పొలాల్లోకి వచ్చి సాగు పనులను పరిశీలించడం పట్ల స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సీడ్ డ్రిల్ వంటి యంత్రాల వినియోగంతో విత్తనాల వృథా తగ్గడంతో పాటు సమాన దూరంలో విత్తనాలు పడటం వల్ల మొక్కల పెరుగుదల మెరుగ్గా ఉంటుందని తెలిపారు.

కూలీల కొరత సమస్యను అధిగమించేందుకు వ్యవసాయ యాంత్రీకరణ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ప్రస్తుత వర్షాకాల పరిస్థితులను సద్వినియోగం చేసుకుని రైతులు సరైన సమయంలో విత్తనాలు వేయాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని కోరారు.

నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రైతు బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆమె పేర్కొన్నారు.

రైతు ఈడిగ వన్నూరప్ప మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు తమ పొలానికి వచ్చి స్వయంగా సాగు పనుల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇది రైతులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల అమలు ద్వారా రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అధికారులు తెలిపారు.