రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన కాయలు
రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన కాయలు
ఖరీఫ్ సీజన్‌కు 700 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో: ఏవో కృష్ణ చైతన్య
రాప్తాడు, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ సాగు చేయాలనుకునే రైతులకు ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయలను అందిస్తున్నట్లు వ్యవసాయ అధికారి (ఏవో) కృష్ణ చైతన్య తెలిపారు.
రాప్తాడు మండలంలోని రాప్తాడు-2 రైతు సేవా కేంద్రంలో సోమవారం వేరుశనగ విత్తన కాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీపై విత్తన కాయల ప్యాకెట్లను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి మండలానికి 700 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమైన రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మండల పరిధిలోని అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన కాయల పంపిణీ కొనసాగుతోందన్నారు. కె-6 రకం వేరుశనగ విత్తన కాయల పూర్తి ధర క్వింటాలుకు రూ.10,200 కాగా, 40 శాతం సబ్సిడీ రూ.4,080 అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో రైతు వాటా క్వింటాలుకు రూ.6,120 మాత్రమే అవుతుందని చెప్పారు.
ఒక బ్యాగు (30 కిలోలు) ధర రూ.1,836గా నిర్ణయించి రైతులకు అందిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓలు సుజిత, రజిత, విహెచ్‌ఏ సోనియా, వీఏఏ గిరిబాబు, మండల టీడీపీ కన్వీనర్ కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, మాజీ కన్వీనర్ నారాయణస్వామి, రైతులు పాల్గొన్నారు.
