మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. జిల్లాలో నషా ముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమాలను ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 14446 నేషనల్ డీ-అడిక్షన్ హెల్ప్‌లైన్ సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి కాలిందిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ప్రమోద్ కుమార్, సూపరింటెండెంట్ రాజయ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత, డీహెచ్‌ఈడబ్ల్యూ-డీఎంసీ అరుణ, బ్లాక్ కోఆర్డినేటర్ హసీబ్, డీ-అడిక్షన్ సెంటర్ కోఆర్డినేటర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
