అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
పెండింగ్ బిల్లులపై సమగ్ర నివేదిక సమర్పించాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తయ్యేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఎంఐడీసీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై శాఖల వారీగా సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అవసరమైన కొత్త అభివృద్ధి ప్రతిపాదనలు ఉంటే రూపొందించి పంపాలని సూచించారు. ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
పనుల అమలులో ఎక్కడైనా లోపాలు లేదా క్రిటికల్ గ్యాప్స్ ఉంటే వెంటనే గుర్తించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
