నిఘా నీడలో కోరుట్లపేట.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి
నిఘా నీడలో కోరుట్లపేట.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి
11 సీసీ కెమెరాల ప్రారంభం..
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి : ఎస్పీ మహేష్ బి. గితే
ఎల్లారెడ్డిపేట, ఆంధ్రప్రభ : కోరుట్లపేట గ్రామం ఇకపై నిఘా నీడలో ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేట గ్రామంలో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామ ప్రజలతో నిర్వహించిన అవగాహన సదస్సులో సీసీ కెమెరాల ప్రాముఖ్యత, డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, రోడ్డు భద్రత అంశాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సహకారంతో జిల్లాలో కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందన్నారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో నేరాలను అరికట్టి, నిందితులపై వేగంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించిన ఎస్పీ, ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఎస్సై రవీందర్ రెడ్డి, సర్పంచ్ జ్యోతి, ఉపసర్పంచ్ పద్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
