కూతురిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగి
కూతురిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగి
బెజ్జంకి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి తన కూతురిని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. మండల పరిధిలోని వీరపూర్ గ్రామానికి చెందిన వరికోలు శ్రీనివాస్ ప్రస్తుతం చిగురుమామిడి మండలంలో జీపీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు.
తన స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో గురువారం తన కుమార్తెను అదే పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందనే సందేశాన్ని సమాజానికి చాటాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన చర్యను గ్రామస్థులు అభినందిస్తూ, ఇతర తల్లిదండ్రులకు ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు భార్గవ్, ఉపాధ్యాయులు శేఖర్, గ్రామ సర్పంచ్ చిలుముల సతీష్‌లు శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇలాంటి చర్యలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అన్నాడి లత, అంగన్‌వాడీ కార్యకర్త రాచకొండ విజయశ్రీ, వార్డు సభ్యులు చిలుముల రజిత, ఉప్పునీటి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
