AP | విధుల పట్ల నిర్లక్ష్యం.. 43 మంది వైద్యుల డిస్మిస్ !!

  • మరో 34 మంది వైద్యుల రాజీనామా

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో సంచలన నిర్ణయం తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన 43 మంది వైద్యులను ప్రభుత్వ సేవల నుంచి శాశ్వతంగా తొలగించింది. ఇదే సమయంలో మరో 34 మంది వైద్యులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

విధులకు గైర్హాజరు కావడం, సేవల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అంశాలపై సంబంధిత వైద్యులకు గతంలోనే సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే అభియోగాలు నమోదు చేసి వివరణ కోరినా పలువురు వైద్యులు స్పందించలేదని చెప్పారు.

నిర్దేశిత నిబంధనల ప్రకారం పలుమార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో 43 మంది వైద్యులను ప్రభుత్వ సేవల నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజారోగ్య సేవల్లో నిర్లక్ష్యానికి ఎలాంటి అవకాశమివ్వబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచడం, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.