IND vs AFG – ODI | సిరీస్ భారత్ సొంతం.. !!
- శుభమన్ కు తొలి విక్టరీ…. !!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ అఫ్గానిస్థాన్‌పై 170 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) అద్భుత సెంచరీలతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ మూడో వికెట్‌కు 224 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను వన్ సైడ్ చేశారు.
అంతకుముందు రోహిత్ శర్మ 48 పరుగులతో మంచి ఆరంభం అందించగా, శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో ఖరోటే నాలుగు వికెట్లు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీశారు.
అనంతరం.. 403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా ఒంటరి పోరాటం చేస్తూ 79 పరుగులు సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. గుర్బాజ్ 41, సెదికుల్లా అతల్ 42 పరుగులతో రాణించారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించారు. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.
బ్యాటింగ్‌లో గిల్, ఇషాన్ కిషన్ చెలరేగిపోవడం, బౌలింగ్‌లో పేసర్లు కట్టుదిట్టంగా రాణించడంతో భారత్ అన్ని విభాగాల్లో అఫ్గానిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా, చివరి వన్డేలో క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది.
