AP | పర్యాటక రంగానికి కొత్త ఊపు !
- 12 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
- పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం..
- ఏడాది పాటు పనితీరుపై సమీక్ష
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత పర్యాటకానికి కొత్త రూపు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా తరహాలో రాష్ట్రంలోని బీచ్ ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) గుర్తించిన ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
తీరప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. బీచ్‌ల వద్ద పర్యాటకులకు విశ్రాంతి, ఆహార సదుపాయాలు, వినోద సేవలు అందించే విధంగా ఈ షాక్స్‌ను అభివృద్ధి చేయనున్నారు.
ఏడాది పాటు పైలట్ ప్రాజెక్ట్..
ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బీచ్ షాక్స్ పనితీరును ఒక సంవత్సరం పాటు పరిశీలిస్తారు. పర్యాటకుల స్పందన, ఆర్థిక ప్రయోజనాలు, స్థానిక ఉపాధిపై ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రంలోని ఇతర తీరప్రాంతాలకు కూడా విస్తరించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బీచ్ షాక్స్ నిర్వహణ, అనుమతులు, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ అంశాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. తీరప్రాంతాల సహజ అందాలు దెబ్బతినకుండా, పర్యావరణ నిబంధనలను పాటిస్తూ ఈ కేంద్రాలు పనిచేయాల్సి ఉంటుంది.
