వైద్య విద్యార్థులకు యోగా సందేశం..
వైద్య విద్యార్థులకు యోగా సందేశం..
ఆరోగ్యకర జీవనానికి ఇదే మార్గం
భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానం యోగా: డాక్టర్ కె. చిట్టి నరసమ్మ
కర్నూలు, ఆంధ్రప్రభ : యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమని, శారీరక-మానసిక ఆరోగ్య పరిరక్షణకు ఇది అత్యుత్తమ సాధనమని అదనపు వైద్య విద్య సంచాలకులు, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు మెడికల్ కాలేజీలో బుధవారం ముందస్తు వేడుకలను నిర్వహించారు.
పతంజలి యోగ సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సహకారంతో యోగా శిక్షకుడు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు శివరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ చిట్టి నరసమ్మ మాట్లాడుతూ, వైద్య విద్యార్థులు యోగాను క్రమం తప్పకుండా అభ్యసించాలని సూచించారు. యోగా ద్వారా మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు శారీరక దృఢత్వం, ఉత్సాహం పెరుగుతాయని తెలిపారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
యోగా శిక్షకుడు శివరాజు మాట్లాడుతూ, వైద్యులు, వైద్య విద్యార్థులు ప్రతిరోజూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులకు వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామ సాధనలను ప్రదర్శించి అవగాహన కల్పించారు. యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మంజుల భాయ్, డీఎస్పీ మెహబూబ్ బాషా, పతంజలి యోగ సమితి జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర గౌడ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మనోహర్, డాక్టర్ సోమశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, లెక్చరర్ సురేష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ రామకృష్ణ, వివిధ విభాగాల అధ్యాపకులు, వైద్యులు, సిబ్బంది, యూజీ విద్యార్థులు పాల్గొని యోగా సాధన చేశారు.
