ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం.. నీటిబొట్టు ఒడిసి పట్టే సమయం ఇదే..!

  • బోర్లు ఎండిపోతున్నాయి..
  • చెరువులు అడుగంటుతున్నాయి..!
  • కరువు రోజులు వస్తున్నాయా..?
  • తెలంగాణను కలవరపెడుతున్న సంకేతాలు

ఆంధ్రప్రభ : పేరుకే వర్షాకాలం వచ్చింది. కానీ ఆకాశం వైపు చూస్తే మేఘం కనిపించడం లేదు. వానల కోసం రైతు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నాడు. బోర్లు ఎండిపోతున్నాయి. సిటీల్లో ట్యాంకర్ల కోసం క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు వాటర్ లెవెల్ కోల్పోతున్నాయి. వాతావరణం చల్లబడాల్సిన సమయంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల వెనుక ప్రధాన కారణంగా.. ఎల్‌నినో, లానినో సూపర్ ఎల్‌నినో అని వాతావరణ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఎల్‌నినో.. లా నినా.. అసలు కథ ఏంటి?

గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పుల చర్చలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు ఎల్‌నినో (El Niño), లా నినా (La Niña). పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. ఇది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశ వాతావరణంపైనా ప్రభావం చూపుతుంది. సాధారణంగా భారతదేశానికి వర్షాలను అందించే రుతుపవనాల బలాన్ని ఇది తగ్గిస్తుంది.

ఫలితంగా వర్షాలు ఆలస్యంగా రావడం, తక్కువగా కురవడం లేదా ప్రాంతాల వారీగా అసమానంగా పడటం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణ మధ్య భారత రాష్ట్రాలు ఈ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సూపర్ ఎల్‌నినో అంటే ఏమిటి?

ఇక సూపర్ ఎల్‌నినో పరిస్థితి మరింత ఆందోళనకరమైనది. సాధారణ ఎల్‌నినో కంటే సముద్ర ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా పెరిగినప్పుడు దానిని సూపర్ ఎల్‌నినోగా పిలుస్తారు. ఇలాంటి సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా వర్షపాత విధానాలు తీవ్రంగా మారిపోతాయి. కొన్ని ప్రాంతాలు వరదలతో ఇబ్బంది పడితే, మరికొన్ని ప్రాంతాలు తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటాయి.

భారతదేశంలో వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి సమస్యలు మరింత తీవ్రం కావచ్చు. అయితే ఇప్పుడు ప్రపంచ వాతావరణ వ్యవస్థలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వర్షాలు పడినా ఒకేసారి కురుస్తున్నాయి, లేదా పూర్తిగా ఎడారిలా మారుతున్నాయి.

అయితే కేవలం ఎల్‌నినోనే కారణమని చెప్పలేం. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, విచ్చలవిడిగా జరుగుతున్న అడవుల నరికివేత, చెరువులు-వాగుల ఆక్రమణ, భూగర్భ జలాల అధిక వినియోగం కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ప్రకృతి ఇచ్చే హెచ్చరికలను పట్టించుకోకుండా సాగితే భవిష్యత్తులో నీటి కోసం మరింత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది ప్రకృతి హెచ్చరికేనా?

జూన్ నెల వచ్చిందంటే తెలంగాణలో మేఘాలు కమ్ముకుని, వర్షాలు మొదలయ్యేవి. కానీ ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైనా ఎండలు తగ్గడం లేదు. వర్షాలు ఆలస్యమవుతున్నాయి. వర్షపాతం సరళి కూడా పూర్తిగా మారిపోతోంది. జూన్ మొదటి వారంలో తెలంగాణ అంతటా విస్తరించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి నెమ్మదిగా కదులుతున్నాయి.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు ఇంకా పూర్తిస్థాయిలో రుతుపవనాలు చేరలేదు. మరోవైపు ఉత్తర తెలంగాణలో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతుండగా, పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాకాలంలో కూడా వేసవి వాతావరణం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణ ఎగువ ప్రాంతం కావడంతో.. ఒకప్పుడు ఇక్క‌డ‌ కరువు సహజమని చెప్పేవారు. తర్వాత కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి భారీ ఎత్తిపోతల పథకాలు వచ్చాయి. సాగు విస్తీర్ణం పెరిగింది. చెరువులు నిండాయి. గ్రౌండ్ వాట‌ర్ లెవల్స్ గ‌ణ‌నీయంగా పెరిగాయి. రైతుల‌ ఆశలు చిగురించాయి.

గోదావరి జలాలను ఎత్తిపోసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యవసాయ రంగంలో కొత్త ఆశలు నింపింది. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ రివర్స్ గేర్‌లో పరిగెడుతున్నట్టు కనిపిస్తోంది.

ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, నిర్మాణ నాణ్యతపై వచ్చిన వివాదాలు, సాంకేతిక సమస్యల కారణంగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నా వాటిని నింపేందుకు అవసరమైన నీరు నదుల్లోకి రావాలి. కానీ ఎల్ నినో కార‌ణంగా వర్షాభావం ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి.

ఎగువ రాష్ట్రాల్లో నుంచి కూడా గోదావరి, కృష్ణా నదుల్లో వ‌ర‌ద‌ ప్రవాహాలు తగ్గుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు తగ్గిపోతే అక్కడి డ్యాంలు నిండవు. డ్యాంలు నిండకపోతే తెలంగాణకు రావాల్సిన వరద జలాలు రావు. అంటే భారీ ప్రాజెక్టులు ఉన్నా వాటిని నింపే నీళ్లు లేకపోతే పరిస్థితి క్లిష్టంగానే ఉంటుంది.

ఒక వైపు వ‌ర్షాలు లేక‌, మ‌రోవైపు వ‌చ్చిన నీటిని భూమిలోకి మ‌ల్లించే దారి లేక రాష్ట్రంలో గ్రౌండ్ వాట‌ర్ లెవ‌ల్ కూడా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో గ్రామాల చుట్టూ పెద్దఎత్తున చెట్లు, అడవులు, పచ్చదనం కనిపించేవి. అడవులు వర్షాలను ఆకర్షించడంలో, నేలలో తేమను నిల్వ ఉంచడంలో, భూగర్భ జలాలను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ డెవ‌ల‌ప్మెంట్ పేరుతో చెట్ల నరికివేత పెరగడంతో ప్రకృతి సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోంది. దాంతో వాతావ‌ర‌ణంలో టెప‌రేచ‌ర్ లు పెరుగుతున్నాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకే సామర్థ్యం తగ్గుతుంది.

వాతావరణ మార్పుల అసలు సంకేతం ఇదే…

నాలుగు నెలలు క్రమం తప్పకుండా కురిసే వర్షాలు ఇప్పుడు కొన్ని గంటల్లోనే కురిసి వెళ్లిపోతున్నాయి. మిగిలిన రోజులు ఎండలే కనిపిస్తున్నాయి. వర్షాలు పడే రోజుల సంఖ్య తగ్గిపోతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఇది కేవలం ఒక ఏడాది సమస్య కాదు.. వాతావరణ మార్పులు (Climate Change) మన గడప తట్టుతున్నాయనే స్పష్టమైన సంకేతం అని వాతావ‌ర‌ణ‌ నిపుణులు చెబుతున్నారు.

ఒకవైపు బోర్లు అడుగంటిపోతున్నాయి. మరోవైపు భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. నగరాల్లో ప్రతి కొత్త అపార్ట్‌మెంట్‌కు వందలాది కుటుంబాలు చేరుతున్నాయి. కానీ రైన్ వాటర్ హార్వెస్టింగ్, భూగర్భ జలాల పునరుద్ధరణపై మాత్రం పెద్దగా దృష్టి లేదు. ఫలితంగా నీటి మట్టాలు ఏటా క్షీణిస్తున్నాయి.

రైతుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. సాగునీటి కోసం, పంటల కోసం, పశువుల కోసం నీరు కావాలి. అదే సమయంలో ఇళ్లలో తాగునీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. నీటి కోసం గ్రామాలు, పట్టణాలు ఒకే విధమైన ఆందోళనను ఎదుర్కొంటున్నాయి.

రైతులు అప్రమత్తం కావాల్సిన సమయం…

ఖరీఫ్ సీజన్ ఎలాగోలా గట్టెక్కినా.. రాబోయే రబీ సీజన్‌పై నీటి కొరత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ‌, వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాల పడిపోతుండగా, చెరువులు, కుంటలు ఆశించిన స్థాయిలో నిండకపోతే సాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అందుకే రైతులు ఇప్పటి నుంచే నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

అధిక నీటి అవసరం ఉండే పంటల కంటే తక్కువ నీటితో సాగు చేసే పంటల వైపు మొగ్గు చూపడం, డ్రిప్‌, స్ప్రింక్లర్ వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులను విస్తృతంగా వినియోగించడం, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకోవడం ఇప్పుడు కాలానుగుణ అవసరంగా మారింది. అదే సమయంలో గ్రామాల్లో చెరువులు, కుంటలు, ఫామ్ పాండ్ల పునరుద్ధరణతో పాటు వర్షపు నీటి సంరక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది.

నగరాలకూ అదే ముప్పు…

పట్టణాలు, మహానగరాలు కూడా అదే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో అపార్ట్‌మెంట్ కల్చర్ పెరగడంతో భూగర్భ జలాల వినియోగం భారీగా పెరిగింది. కానీ అదే స్థాయిలో భూగర్భ జలాల పునరుద్ధరణకు చర్యలు కనిపించడం లేదు. అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఉన్నా అవి సక్రమంగా పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా ప్రతి వేసవిలో ట్యాంకర్ల కోసం క్యూలైన్లు క‌ట్టే పరిస్థితి ఏర్పడుతోంది. ఒకప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కనిపించే వాటర్ ట్యాంకర్లు ఇప్పుడు నగర జీవనంలో భాగమైపోయాయి.

నీటి సంరక్షణ ఉద్యమంగా మారాల్సిందే..

విచిత్రం ఏమిటంటే.. వర్షాలు లేకపోతే నీటి కోసం ఆందోళన చెందుతున్నాం.. వర్షాలు పడితే నగరాలే చెరువులుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ సహా అనేక నగరాల్లో కేవలం రెండు మూడు గంటల వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి. కాలనీలు మునిగిపోతున్నాయి. ట్రాఫిక్ స్తంభిస్తోంది. అయితే ఈ నీటిలో అత్యధిక భాగం భూమిలోకి ఇంకకుండా డ్రైనేజీల ద్వారా బయటకు వెళ్లిపోతోంది లేదా రోడ్లపైనే నిలిచి చివరకు ఆవిరైపోతోంది.

ప్రభుత్వాలు ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినా, ఎన్ని రిజర్వాయర్లు ఏర్పాటు చేసినా ప్రకృతి ప్రసాదించే నీటిని సక్రమంగా దాచుకోకపోతే సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండదు. ఒకప్పుడు చెరువులు, కుంటలు, ఖాళీ భూములు వర్షపు నీటిని భూగర్భంలోకి చొప్పించే సహజ వ్యవస్థలుగా పనిచేసేవి. ఇప్పుడు కాంక్రీట్ అడవులు పెరగడంతో నీరు భూమిలోకి వెళ్లే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా ఒకవైపు వర్షాకాలంలో వరదలు, మరోవైపు వేసవిలో నీటి ఎద్దడి అనే ద్వంద్వ సమస్యను ఎదుర్కొంటున్నాం.

ఈ స‌మ‌స్య‌లు పూర్తిగా క‌రువుగా మార‌కుండా ఉండాలంటే.. ప్రతి గ్రామం, ప్రతి చెరువు, ప్రతి ఇంటి వద్ద వర్షపు నీటిని ఒడిసిపట్టే వ్యవస్థలు తప్పనిసరి కావాలి. ప్రతి అపార్ట్‌మెంట్, ప్రతి ఇల్లు రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ అమలు చేయడం భవిష్యత్తు తరాలకు మనం చేసే గొప్ప పెట్టుబడిగా మారుతుంది.

ఎక్కడైనా దారి తప్పామా?

తెలంగాణ ఎదుర్కొన్న తీవ్ర కరువును దశాబ్దాల క్రితమే దాటి వచ్చాం. ఎండిపోయిన పొలాలు, పంటలు పండక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులను చూశాం. గ్రామాల్లో తాగునీటి కోసం మహిళలు బిందెలు భుజాన వేసుకుని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిన కాలాన్ని అనుభవించాం. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు చెరువుల పునరుద్ధరణ, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టులతో సుభిక్ష భవిష్యత్తు వైపు అడుగులు వేశాం.

కానీ నేడు ఎండిపోతున్న బోర్లు, అడుగంటుతున్న రిజర్వాయర్లు, నీటి ట్యాంకర్ల కోసం క్యూలైన్లు చూస్తుంటే… మళ్లీ మనం గతంలోకి నడుస్తున్నామా అనే సందేహం కలుగుతోంది. ఒకవైపు కొత్త రోడ్లు, భారీ భవనాలు, విస్తరిస్తున్న నగరాలు, పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తున్నాం. మరోవైపు మనల్ని మోసే నేల తల్లిని, మన జీవనాధారమైన నీటి వనరులను కాపాడటంలో ఎక్కడైనా వెనుకబడుతున్నామా అనే ప్రశ్న తలెత్తుతోంది.

చెరువుల ప్లేస్ లో కాలనీలు వ‌చ్చాయి.. వాగులు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి.. వర్షపు నీరు భూమిలోకి ఇంకే సహజ మార్గాలు మూసుకుపోయాయి… ఫలితంగా వర్షాలు పడితే నగరాలు మునిగిపోతున్నాయి. వర్షాలు పడకపోతే కరువు కాటేస్తోంది. ప్రకృతి ఇచ్చిన వరాన్ని నిల్వ చేసుకోవడంలో విఫలమై, సమస్యలను మ‌న‌కు మనమే సృష్టించుకున్నామా అనే ఆత్మపరిశీలన ఇప్పుడు అత్యవసరం.

నీరు ఉంటేనే భవిష్యత్ ఉంటుంది అనే సత్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. ప్రపంచవ్యాప్తంగా నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నారు. విన‌డానికి అది అతిశయోక్తిలా అనిపించినా… నేటి ప‌రిస్థితులు.. ఎండిపోతున్న భూగర్భ జలాలు, తగ్గుతున్న వర్షపాతం, పెరుగుతున్న నీటి డిమాండ్ చూస్తుంటే ఆ హెచ్చరికలు నిజమవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేలతల్లి మనకు ఇస్తున్న హెచ్చరికలను పట్టించుకోకపోతే రేపటి రోజుల్లో నీటి కోసం మరింత పెద్ద మూల్యం చెల్లించాల్సి రావచ్చు. అందుకే నీటిబొట్టు ఒడిసి పట్టే సమయం ఇదే..!