Vijayashanti | రాములమ్మ తదుపరి అడుగుపై చర్చ
Vijayashanti | రాములమ్మ తదుపరి అడుగుపై చర్చ
Vijayashanti | విజయశాంతి మంత్రి పదవిపై ఫోకస్..
కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ సమీకరణాలా?
మంత్రి పదవి కోసం విజయశాంతి ఢిల్లీ మంత్రాంగం
రాహుల్, ప్రియాంకలతో వరుస భేటీలు
Vijayashanti | హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసిన ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్‌లో కీలక పదవిని అధిష్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్‌లో తనకూ మంత్రి పదవి కావాలంటూ హస్తిన బాట పట్టారు. రేవంత్ కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, అవకాశాలను అదునుగా అందిపుచ్చుకునేందుకు నేరుగా ఢిల్లీలోనే మంత్రాంగం నడిపిస్తున్నారు. ఒకవేళ కేబినెట్ ప్రక్షాళన జరిగితే, ఇద్దరు మహిళా మంత్రుల్లో ఒకరిని తప్పించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఆ అవకాశం తనకే దక్కాలని విజయశాంతి వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తున్నారు.
రాహుల్, ప్రియాంక చుట్టూ ప్రదక్షిణలు
రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో, మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర ముఖ్య నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాములమ్మ మాత్రం ఒక పక్కా ప్లాన్‌తో హస్తిన బాట పట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ మైలేజీకి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లేది తెలియజేసే బ్లూప్రింట్‌ను కూడా ఆమె సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లతో పాటు ఇతర పార్టీ పెద్దలను సంప్రదించకుండా నేరుగా ఢిల్లీ అధిష్టానంతోనే రాయబారాలు నడపడం పట్ల పార్టీ నాయకుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కీలక పదవి ఆశిస్తుండడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీరాజ్, పురపాలక ఎన్నికల్లో ఆమె కనిపించలేదు. అలాగే జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సీనియర్లు విజ్ఞప్తి చేసినా ప్రచారానికి రాలేదు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ప్రచారానికి వెళ్లాలని ఏఐసీసీ అధిష్టానం సూచించినా ఆమె ఇంటిపట్టునే ఉన్నారు.
ఊహించని పరిణామాల నేపథ్యంలో జాబితాలోనే లేని ఆమెకు గత ఏడాది కాంగ్రెస్ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అయితే, ఈ ఎమ్మెల్సీ పదవిపై రాములమ్మ అస్సలు సంతోషంగా లేరన్నది అంతరంగిక సమాచారం. తన సీనియారిటీకి, ఇమేజ్‌కు మంత్రి పదవి కావాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొన్నటి మండలి సమావేశాల్లో సొంత ప్రభుత్వంపైనే ఆమె కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం, పరోక్షంగా తన అక్కసు వెళ్లగక్కడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవి దక్కే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. ఒకవేళ ఆశించిన పదవి కాకుంటే, కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ‘రాములమ్మ’ రూట్ మార్చబోతున్నారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
