All India Radio history | దక్షిణ భారత రేడియో ప్రసారాల చరిత్రాత్మక ప్రాధాన్యం

All India Radio history | దక్షిణ భారత రేడియో ప్రసారాల చరిత్రాత్మక ప్రాధాన్యం

All India Radio history | ఆల్ ఇండియా రేడియో ఆవిర్భావం
మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభ దశ
డెక్కన్ రేడియో మరియు హైదరాబాద్ ప్రసారాలు
మైసూరు, తిరువంకూరు రేడియో అభివృద్ధి
స్వాతంత్ర్యం తర్వాత ఆకాశవాణి విస్తరణ

All India Radio history | ‘ఆల్ ఇండియా రేడియో, ఢిల్లీ కేంద్రము, దక్షిణ ప్రాంతాలకు ప్రత్యేక ప్రసారము, కుమారి కమల గానము’…. ఆ మాటలు అంటూ ఉంటే, ఒక వింత విద్యుచ్ఛక్తి నాలోని ప్రతి అణువునా వింతగా స్పందించింది.” అని ఆచంట జానకి రామ్ తన ఆత్మకథ ‘సాగుతున్న యాత్ర’ రెండవ భాగం తొలి అధ్యాయంలో అన్నారు. ఈ విషయం చెప్పడానికి ముందు ఇంకా ఇలా అంటారు: “….. నేను పనిలో ప్రవేశించిన మూడవ నాడే ఆల్ ఇండియా రేడియో వారు దక్షిణ ప్రాంతాలకు ప్రత్యేక ప్రసారం ప్రారంభించారు, ఢిల్లీ కేంద్రము నుంచి. భారతీయ బ్రాడ్‌కాస్టింగ్ విధానంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమన్నమాట. సాయంత్రం సరిగ్గా ఆరున్నరకు నేను మైక్రోఫోన్ ఎదుట కూర్చుని అన్నాను.”

‘ఆల్ ఇండియా రేడియో’ అనే నామకరణం 1936 జూన్ 8న జరిగింది, కనుక 90 ఏళ్లు అవుతోందని ఇప్పుడు కొంత ఆసక్తి, ప్రచారం నెలకొని ఉంది. ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం 1938 జూన్ 16న ప్రారంభం కావడానికి ముందే ఢిల్లీ నుంచి తెలుగు ప్రసారాలు మొదలయ్యాయి. కానీ జానకిరామ్ ఆ తేదీ పేర్కొనలేదు కనుక ప్రస్తుతానికి అది పెద్ద వెలితే. కానీ తరచి చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తారసపడుతున్నాయి.

మద్రాసులో రేడియో ప్రసారం పట్ల ఆసక్తి ఉన్న కొందరు ఔత్సాహికులు 1924 మే 16న మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ విస్కౌంట్ గోషాన్ తోడ్పాటుతో సమావేశమయ్యారు. మార్కొని కంపెనీకి చెందిన ప్రతినిధి ఇంగ్లాండులోని రేడియో క్లబ్బులు; అలాగే బొంబాయి, కలకత్తా నగరాలలో ఏర్పాటైన రేడియో క్లబ్బుల గురించి ఉత్సాహం కలిగిస్తూ ప్రసంగించారు. ఆ సభలో సి.వి. కృష్ణస్వామి చెట్టి అనే ఔత్సాహికుడైన తెలుగు వ్యక్తి ‘మద్రాసు రెసిడెన్సీ రేడియో క్లబ్’ అనే పేరును ప్రతిపాదించి ఆమోదింప చేశారు.

కృష్ణస్వామి చెట్టి ఇంగ్లాండులో చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తూ 40 వాట్ల ట్రాన్స్మిటర్ నిర్మించుకోవడానికి అవసరమైన పరికరాలను తన వెంట తీసుకొని వచ్చారు. 5 మైళ్ళు లేదా 8 కిలోమీటర్లు మాత్రమే వినబడే ప్రసార సామర్థ్యమున్న ఈ రేడియో ట్రాన్స్మిటర్‌ను ఆలస్యం చేయకుండా రేడియో క్లబ్ ప్రారంభం తర్వాత కృష్ణస్వామి చెట్టి ప్రయోగాత్మకంగా నిర్మించారు. అలా 1924 జులై 31న మద్రాస్ ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ ప్రసారాలను ప్రారంభించింది.

ఈ చిన్న ట్రాన్స్మిటర్‌కు బదులుగా 200 వాట్ల సామర్థ్యమున్న ట్రాన్స్మిటర్‌ను బిగించి ప్రతిరోజు సాయంకాలం సంగీతం, ప్రసంగాలతో కలిసి రెండున్నర గంటల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ వచ్చారు. ఈ రేడియో క్లబ్ నిర్వహించిన ప్రసార ప్రయత్నాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే 1927 దాకా కొనసాగాయి.

చివరికి మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ నిర్వహించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పట్లో వార్తాపత్రికలు మధ్యాహ్నానికి అచ్చై, సాయంత్రానికి పాఠకులను చేరేవి. ఆరోజుల్లో వార్తాపత్రికలు చదవబడేదాకా, రేడియో వార్తలను ప్రసారం చేయకూడదనే నిర్ణయం ఇంగ్లాండులో కూడా ఉండేది. మద్రాసు కార్పొరేషన్ పాత రేడియో ట్రాన్స్మిటర్‌ను గవర్నమెంట్ మ్యూజియంకు బహుమతిగా ఇచ్చింది.

(1938 జూన్ 16న మొదలైన ఆల్ ఇండియా రేడియో, మద్రాస్ కేంద్రానికి 88వ వార్షికోత్సవం)

తన ట్రాన్స్మిటర్‌ను మద్రాసు కార్పొరేషన్‌కు బహుకరించగా; ప్రసారానికి అనుమతి పొంది, కార్పొరేషన్ 1930 జూలై 1న రెగ్యులర్ రేడియో సర్వీసును ప్రారంభించింది. వినోద కార్యక్రమాలతో పాటు సంగీత పాఠాలు, స్కూలు ఉన్న రోజుల్లో కథలు ప్రసారం చేసేవారు. ఆదివారం సెలవు రోజుల్లో ఉదయం గ్రామఫోన్ రికార్డులు కూడా వేసేవారు. పాశ్చాత్య సంగీతం కూడా ప్రసారం చేసేవారు.

ఎక్కువమంది వినాలని మెరీనా, రాబిన్సన్ పార్క్, పీపుల్స్ పార్క్, హైకోర్టు బీచ్ వంటి ఆరు చోట్ల లౌడ్ స్పీకర్లు రేడియోకు అనుసంధానించి సాయంకాలం పూట వినిపించేవారు. అలాగే విద్యార్థులకు ఉపయోగపడాలని 14 కార్పొరేషన్ పాఠశాలలకు రేడియో సెట్లు బహుకరించారు.

రేడియో ప్రసారాల ప్రాముఖ్యతను బాగా గుర్తించిన మద్రాస్ ప్రెసిడెన్సీ 1934 ఫిబ్రవరిలో బి.బి.సి. నుంచి వి.ఏ.ఎం. బులో ఆహ్వానించి, 40 లక్షల రూపాయలు వెచ్చించి ఏరీతిన ప్రసారాలు మరింత మందికి అందేలా చేయవచ్చునో ప్రణాళిక చేయించారు. అయితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి రేడియో ప్రసారాలపై వేరే ఆలోచనలు ఉండటంతో దీనికి ఆమోదం లభించలేదు.

ఈ రేడియో ప్రసారాలు కేవలం మద్రాసు, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే కాకుండా చిత్తూరు, విజయనగరం వంటి తెలుగు ప్రాంతాలకూ, అలాగే శ్రీలంక వరకు చేరేవని నమోదు చేయబడింది. ఈ ప్రసార సదుపాయాలు 1938 జూన్ 16న మద్రాసులో ఆల్ ఇండియా రేడియో కేంద్రం మీడియం వేవ్, షార్ట్ వేవ్ మీద ప్రసారాలు ప్రారంభించేదాకా కొనసాగాయి అని హెచ్.ఆర్. లూథ్రా ‘ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్’ అనే పుస్తకంలో పేర్కొంటారు.

దక్షిణ భారతదేశంలో రేడియో ప్రసారాలకు సంబంధించి మద్రాసు తర్వాత హైదరాబాద్ నగరం చరిత్ర సృష్టించింది. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగి మహమ్మద్ అలీ ఉత్సాహంతో 1933లో ఒక చిన్న రేడియో ట్రాన్స్మిటర్ వాడారు. ఈ సమాచారం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దాకా వెళ్లి ఆయన ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతారు.

1935 ఫిబ్రవరి 3న ‘డెక్కన్ రేడియో’ ప్రారంభమైంది. ఈ రేడియో స్టూడియో ఖైరతాబాద్‌లో ఉండేదని చెబుతారు. తర్వాత కొంతకాలానికి ఔరంగాబాద్ ప్రారంభమైందని తెలుస్తోంది.

పోలీసు యాక్షన్ తర్వాత హైదరాబాద్ నిజామ్ భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు ప్రకటన చేసినది కూడా ఈ డెక్కన్ రేడియో ద్వారానే. అదే సంవత్సరం 1935 సెప్టెంబర్ 10న మైసూరు విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ ఎం.వి. గోపాలస్వామి 30 వాట్ల ట్రాన్స్మిటర్‌ను తన ఇంటి నుంచి ప్రారంభించారు. ఈ రేడియో కేంద్రం 1942లో మైసూరు మహారాజా నిర్వహణలోకి వెళ్లింది.

1943లో తిరువంకూరు సంస్థానం వారి రేడియో త్రివేండ్రంలో మొదలైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాదు, మైసూరు, తిరువంకూరు సంస్థానాల రేడియో కేంద్రాలు ఆల్ ఇండియా రేడియో నిర్వహణలోకి వెళ్లాయి.

హైదరాబాద్ నిజామ్‌కు వ్యతిరేకంగా, స్వాతంత్ర్యోద్యమానికి అనుకూలంగా పనిచేసిన ‘భాగ్యనగర్ రేడియో’ 1947–48లో కర్నూలు నుంచి చరిత్రాత్మకంగా నిర్వహించబడింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విజయవాడ ఆకాశవాణి 1948 డిసెంబర్ 1న మొదలైంది. భారత ప్రభుత్వం డెక్కన్ రేడియోను 1950 ఏప్రిల్ 1 నుంచి ఆల్ ఇండియా రేడియోగా మార్చి తెలుగు ప్రసారాలను పెంచింది.

డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు,
మొబైల్: 9440732392

Leave a Reply