జర్నలిస్టు పాల్వంచ సత్యనారాయణపై దాడి ఖండనీయం..

జర్నలిస్టు పాల్వంచ సత్యనారాయణపై దాడి ఖండనీయం..

  • దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయులు

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట డివిజన్‌లో సీనియర్ జర్నలిస్టు పాల్వంచ సత్యనారాయణపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించదగినదని, ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు, బెదిరింపులు, చిన్నచూపు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జర్నలిస్టు అంటే కేవలం వార్తలు రాసే వ్యక్తి మాత్రమే కాదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యతాయుతమైన సామాజిక శక్తి. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు వంటి అంశాలను సమాజానికి చేరవేసే కీలక బాధ్యత పాత్రికేయులదే.

జర్నలిస్టులకు సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. ప్రజా ప్రయోజనాల కోసం నిజాలను వెలుగులోకి తీసుకురావడం ప్రతి పాత్రికేయుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలపై ప్రశ్నించే హక్కు జర్నలిస్టులకు ఉంటుంది. వార్తలు రాయడాన్ని వ్యక్తిగతంగా తీసుకుని కక్షసాధింపులతో దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకర సంకేతంగా భావించాలి.

ప్రతి ఉదయం ప్రజలు పత్రికలు చదివి తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటారు. ఆ వార్తల వెనుక పాత్రికేయుల శ్రమ, బాధ్యత, సమాజం పట్ల నిబద్ధత దాగి ఉంటుంది. అద్దంలో మన ముఖం కనిపించినట్లే సమాజంలోని మంచి, చెడు, సమస్యలు, విజయాలను జర్నలిస్టులు వార్తల రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తారు. వాటిని నిర్మాణాత్మక దృక్పథంతో స్వీకరిస్తే సమాజానికి మేలు జరుగుతుంది.

ప్రభుత్వ అధికారులు తమ శాఖల నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించినట్లే, జర్నలిస్టులు కూడా తమ వృత్తి నైతిక విలువలు, సామాజిక బాధ్యతల ప్రకారం పనిచేస్తుంటారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు చేరేలా చేయడమే పత్రికల ప్రధాన లక్ష్యం.

జర్నలిస్టులపై దాడులు పెరిగితే ప్రజలకు నిజమైన సమాచారం అందే మార్గాలు దెబ్బతింటాయి. భవిష్యత్తులో ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య అపోహలు పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల పాత్రికేయులకు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, మేధావులు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

సీనియర్ జర్నలిస్టు పాల్వంచ సత్యనారాయణపై జరిగిన దాడిని సమాజంలోని ప్రతి వర్గం ముక్తకంఠంతో ఖండించాలి. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి. జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పత్రికలు వేర్వేరు పేర్లతో ఉండవచ్చు. కానీ వాటి లక్ష్యం ఒక్కటే – ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం. జర్నలిస్టుపై ఎత్తిన చేయి ఒక వ్యక్తిపై కాదు, ప్రజలు తెలుసుకునే హక్కుపై ఎత్తిన చేయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.