Jyeshtabhishekam Tirumala | ఈనెల 26 నుంచి తిరుమలలో శ్రీవారి జ్యేష్టాభిషేకం

Jyeshtabhishekam Tirumala | ఈనెల 26 నుంచి తిరుమలలో శ్రీవారి జ్యేష్టాభిషేకం

Jyeshtabhishekam Tirumala | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. ఈ ఉత్సవాల సందర్భంగా జూన్ 28న నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.

ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా మూడు రోజుల పాటు శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అధికారులు పేర్కొన్నారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని, దీనిని ‘అభిద్యేయక అభిషేకం’ అని కూడా పిలుస్తారని తెలిపారు.

తరతరాలుగా అభిషేకాలు నిర్వహించడం వల్ల శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా వాటిని పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ మలయప్పస్వామివారి బంగారు కవచాన్ని తొలగించి, హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం వజ్ర కవచాన్ని అలంకరిస్తారు.

రెండవ రోజు స్వామివారికి ముత్యాల కవచాన్ని అలంకరిస్తారు. మూడవ రోజు తిరుమంజనం అనంతరం బంగారు కవచాన్ని తిరిగి సమర్పిస్తారు. జ్యేష్టాభిషేకం సందర్భంగా సమర్పించే బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తొలగిస్తారని, అప్పటి వరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారని టీటీడీ అధికారులు వెల్లడించారు.