Accident | ఇద్దరు ఆటోడ్రైవర్ల దుర్మరణం

Accident | ఇద్దరు ఆటోడ్రైవర్ల దుర్మరణం

Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ చెత్త టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతిచెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంద మల్లమ్మ చౌరస్తాలోని చంద్రా గార్డెన్స్ సమీపంలో ఆటోడ్రైవర్ సంతోష్ (26) వాహనం రిపేర్ కావడంతో రోడ్డుపక్కన ఆపాడు. ఆటోను మెకానిక్ షాపునకు తరలించేందుకు సాయం కావాలని తన స్నేహితులు ప్రసాద్, సునీల్ (33)లకు సమాచారం ఇచ్చాడు.

దీంతో వారు మరో ఆటోలో అక్కడికి చేరుకుని, చెడిపోయిన ఆటోను తమ ఆటోకు తాడుతో కట్టి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఎల్బీనగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన జీహెచ్‌ఎంసీ చెత్త టిప్పర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారిపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో సంతోష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన సునీల్, ప్రసాద్‌లను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సునీల్ కూడా మృతిచెందాడు. ప్రసాద్‌కు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.