గనిలో పేలుడు.. కార్మికుడికి తీవ్ర గాయాలు
గనిలో పేలుడు.. కార్మికుడికి తీవ్ర గాయాలు
కేటీకే-5 గనిలో బ్లాస్టింగ్ సమయంలో ప్రమాదం
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు
భూపాలపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి భూపాలపల్లి ఏరియాకు చెందిన కేటీకే-5 గనిలో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు ఉత్పత్తి కోసం నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ పనుల సమయంలో పేలుడు సంభవించడంతో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం ప్రకారం.. కేటీకే-5 గనిలో తొలి షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న షార్ట్ ఫైరర్ శ్రీరాముల ప్రదీప్ 13వ లెవెల్‌లో బ్లాస్టింగ్ పనులు చేపట్టాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అతని చేతిలో ఉన్న పేలుడు పదార్థం పేలినట్లు తెలుస్తోంది. ఘటనలో ప్రదీప్ ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
పేలుడు శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన తోటి కార్మికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ప్రదీప్‌ను బయటకు తీసుకొచ్చారు. అనంతరం భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రత్యేక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఘటనపై సింగరేణి అధికారులు ఆరా తీస్తుండగా, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో గనుల్లో భద్రతా ప్రమాణాల అమలు, పేలుడు పదార్థాల నిర్వహణపై మరోసారి చర్చ మొదలైంది.
