Singareni Controversy | సింగరేణిపై దుష్ప్రచారం సహించం
Singareni Controversy | సింగరేణిపై దుష్ప్రచారం సహించం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకుంటాం
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి..
రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని హితవు
Singareni Controversy |మంచిర్యాల, ఆంధ్రప్రభ: సింగరేణి కార్మికుల కష్టం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాన్నైనా సహించబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణి ప్రతిష్ఠను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని సందర్శించిన భట్టి విక్రమార్క, గనిలో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణిపై జరుగుతున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికే ఈ బహిరంగ పరిశీలన చేపట్టినట్లు తెలిపారు.

ప్రతిపక్షాలు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించిన ఆయన, ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ వాస్తవాల ఆధారంగానే పనిచేస్తుందని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధి వెనుక కార్మికుల చెమట, శ్రమ ఉన్నాయని, వారి గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. సింగరేణి తెలంగాణకు ఆభరణం వంటిదని పేర్కొన్న భట్టి విక్రమార్క, నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూడటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్న ఫిర్యాదులు కూడా వాస్తవాలకు దూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అది తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. సంస్థ వనరులు, బలం ప్రజల నుంచే వచ్చాయని, వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుంటుందని హెచ్చరించారు. గనిలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా ప్రక్రియలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ గనిలో మరో 28 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తికి సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారుల నివేదికలు సూచిస్తున్నాయని వెల్లడించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారికి మెరుగైన వైద్య సేవలు, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క తెలిపారు.

