ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం
ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం
వేసవి సెలవుల చివరి రోజున కనకదుర్గమ్మ దర్శనానికి భారీ రద్దీ
వీఐపీ దర్శనాల రద్దు..
సామాన్య భక్తులకే ప్రాధాన్యం.
క్యూ లైన్లలోనే చల్లని తాగునీరు..
ఆలయ ఏర్పాట్లపై భక్తుల హర్షం
అన్నదానం, ప్రసాదాల పంపిణీతో సేవలు
ప్రణాళికాబద్ధ ఏర్పాట్లతో రద్దీ క్రమబద్ధీకరణ.
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం, వేసవి సెలవుల చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచే ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోగా, ఆలయ అధికారులు ముందస్తు ప్రణాళికతో రద్దీని సమర్థవంతంగా నిర్వహించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించారు.
వేసవి సెలవుల ముగింపు నేపథ్యంలో..

వేసవి సెలవుల ముగింపు సందర్భంగా కుటుంబ సమేతంగా భక్తులు అమ్మవారి దర్శనానికి రావడంతో ఉదయం 7 గంటల నుంచే క్యూ లైన్లు నిండిపోయాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీంతో సామాన్య భక్తులకు వేగవంతంగా అమ్మవారి దర్శనం లభించింది. డీఈఓ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్‌లు క్యూ లైన్ల నిర్వహణను పర్యవేక్షిస్తూ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ వినూత్న సేవపై భక్తులు ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా ఉచిత ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎండ తీవ్రత పెరగడంతో భక్తుల రద్దీ క్రమంగా తగ్గుముఖం పట్టింది.
ధర్మకర్తల మండలి సభ్యులు స్వయంగా క్యూ లైన్లలో పర్యటించి భక్తుల అవసరాలను తెలుసుకుంటూ సౌకర్యాలను పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ వాకీటాకీ ద్వారా సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ క్యూ లైన్లను క్రమబద్ధీకరించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పాలకమండలి, అధికారుల సమన్వయం, ముందస్తు ప్రణాళికలు మరియు సిబ్బంది కృషి ఫలితంగా ఇంతటి భారీ రద్దీలోనూ భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలు ప్రశాంతంగా జరిగాయి. వేసవి సెలవుల చివరి రోజు నమోదైన భారీ భక్తుల రద్దీని ఆలయ యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహించడంతో భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
