భూమి కేటాయింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

భూమి కేటాయింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రాంగణం నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను తరలించాలి..

మంత్రి ఎన్‌ఎం‌డీ ఫరూక్‌కు అఖిలపక్ష నేతల వినతి

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె మార్కెట్ యార్డులో రెండు ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్) ప్రాంగణంలో కొనసాగుతున్న తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయాన్ని ఇతర అనువైన ప్రాంతానికి తరలించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు ఆదివారం రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎం‌డీ ఫరూక్‌ను అఖిలపక్ష నాయకులతో కలిసి కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ, “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, ప్రజా ఆస్తులను ప్రజల ప్రయోజనాల కోసం పరిరక్షించాల్సిన బాధ్యత కలిగి ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఉద్దేశించిన నూనెపల్లె మార్కెట్ యార్డు భూమిని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించడం పార్టీ మూల సిద్ధాంతాలకు, ప్రజల ఆశయాలకు విరుద్ధమైన నిర్ణయమని పేర్కొన్నారు.

రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్, నిల్వ, గోదాముల నిర్వహణ వంటి అవసరాలకు కీలకమైన మార్కెట్ యార్డులను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన భూములను రాజకీయ అవసరాలకు మళ్లించడం ప్రజా వ్యతిరేక చర్యగా ప్రజలు భావిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే 125 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం రాష్ట్ర, జాతీయ వ్యవసాయ రంగాలకు విశిష్ట సేవలు అందిస్తోందని తెలిపారు. పరిశోధన స్థానం ప్రాంగణంలో కొనసాగుతున్న తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయం కారణంగా పరిశోధన కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని, వెంటనే ఇతర ప్రాంతానికి తరలించి వ్యవసాయ పరిశోధన సంస్థను పరిరక్షించాలని కోరారు.

ఇటీవల రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఏకగ్రీవంగా నూనెపల్లె మార్కెట్ యార్డు భూమి కేటాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రాంగణం నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను తరలించాలని తీర్మానించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి ఎన్‌ఎం‌డీ ఫరూక్ ఈ అంశాలను సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వం, పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్, ఏపీ రైతు సంఘం నాయకులు రామచంద్రుడు, సామన్న, అడ్వకేట్ శంకరయ్య, ఎంవీపీఎస్ నాయకులు పులికొండన్న, బీసీ సంక్షేమ నాయకులు ప్రసాద్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు రాంబాబు, ఎస్‌డీపీఐ నాయకుడు మజీద్, చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా, సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు ఏరువ రామచంద్రారెడ్డి, నిట్టూరు సుధాకర్‌రావు, పట్నం రాముడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply