Illegal-Collections : శివయ్యకే శఠగోపం Amdhra Prabha Top Story

Illegal-Collections : శివయ్యకే శఠగోపం Amdhra Prabha Top Story

  • అయ్యోర్ల హుండీలో కాసుల వర్షం
  • శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో అక్రమాలు
  • రాహుకేతు పూజల్లో అక్రమ వసూళ్లు
  • పూజ ఏదైనా.. పైసల్ ఇవ్వాల్సిందే
  • పూజను బట్టి వసూళ్లు
  • ఒక్కో పూజకు ఒక్కో రేటు
  • హుండీ ఆదాయాన్ని మించిపోయిన అక్రమ ఆదాయాలు
  • రోజుకు సగటున 7 లక్షల వరకు వసూలు
  • వాటాలు వేసుకుని పంచుకుంటున్న అయ్యోర్లు
  • కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్నీ వాటాలే
  • శ్రీకాళహస్తీశ్వర స్వామి హుండీ ఆదాయానికి మించిన వసూళ్లు
  • అన్నీ తెలిసినా .. ఆలయ అధికారులు మౌనదీక్ష

దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. రాహు-కేతు పూజలకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. అయితే భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా నిలవాల్సిన ఈ పుణ్యక్షేత్రంలో కొందరు అయ్యోర్ల అక్రమ వసూళ్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారిక రుసుములకు అదనంగా భక్తుల నుంచి నగదు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూజలను బట్టి రేట్లు నిర్ణయించి డబ్బులు తీసుకుంటున్నారనే ప్రచారం భక్తులను కలవరపెడుతోంది. రోజుకు లక్షల్లో అక్రమంగా నగదు చేతులు మారుతోందని, ఈ వ్యవహారంపై ఆలయ అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ చర్యలు కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హుండీ ఆదాయాన్ని మించి అనధికారిక వసూళ్లు జరుగుతున్నాయంటే ఉంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవుడి సన్నిధిలోనే జరుగుతున్న ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ):

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. రాహు కేతు పూజలను ఆసరాగా చేసుకుని రోజుకు లక్షలు సంపాదిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య, ముఖ్యంగా రాహు-కేతు పూజలకు హాజరయ్యే వారి రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు అయ్యోర్లు అదనపు ఆదాయ మార్గాలను ఏర్పరుచుకున్నారు. అధికారిక టిక్కెట్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా పూజలు సజావుగా జరగాలంటే అదనంగా నగదు చెల్లించాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. ఇలా ప్రతిరోజూ సేకరించే నగదు మొత్తం హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం మించిపోతుందన్న ప్రచారం ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.

Illegal-Collections : ఒక్కో సేవకు ఒక్కో రేటు

Illegal-Collections

ఆలయంలో నిర్వహించే రాహు కేతు పూజలు, సేవలకు అనుగుణంగా అనధికారిక వసూళ్ల రేట్లు కూడా మారుతుంటాయి. భక్తుల ఆర్థిక స్థితి, అత్యవసరత, వారి అవసరాలను బట్టి కూడా నగదు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థ పూర్తిగా అనధికారికంగా, ఎలాంటి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోంది. భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మార్చే ధోరణి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. భక్తి, ఆధ్యాత్మికత ప్రధానంగా ఉండాల్సిన ఆలయ వాతావరణంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అయ్యోర్లు వ్యవస్థీకృతంగా ఈ వసూళ్లను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఆలయ యాజమాన్యం పారదర్శక చర్యలు చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Illegal-Collections : రాహుకేతు పూజల్లో …

Illegal-Collections

శ్రీకాళహస్తి ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే రాహు-కేతు పూజల చుట్టూనే అక్రమ వసూళ్ల వ్యవహారం ఎక్కువగా నడుస్తోంది. శ్రీకాళహస్తిలో రూ.500, రూ.750, రూ.1500, రూ.2500, రూ.5000 వేల రాహుకేతు పూజలు అందుబాటులో ఉన్నాయి. భక్తులు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి రాహుకేతు పూజ చేయించుకుంటారు. టోకన్ కొనుగోలు చేసిన తరువాత పూజా మండపాల్లో అక్కడ ఉన్న పూజారులు సామూహికంగా రాహుకేతు పూజలు చేయిస్తారు. సాధారణంగా పూజ అయిపోయిన తరువాత అదనపు వసూళ్లు చేయరాదు. కానీ పూజారులు మాత్రం ఈ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. పూజా ఫలం దక్కాలంటే దక్షణ సమర్పించాలంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఈ గోల అంతా ఎందుకు అనుకుంటూ భక్తులు అదనపు పైకాన్ని పూజారులకు సమర్పిస్తున్నారు.

Illegal-Collections : పైసలు ఇవ్వాల్సిందే

Illegal-Collections

పూజను బట్టి అదనపు వసూళ్లు ఉంటాయి. రూ.500 పూజకు అదనంగా రూ.101, అలాగే రూ.750, రూ.1,500, రూ.2500 పూజలకు రూ.201, రూ.5000 పూజకు 1001 అదనంగా వసూలు చేస్తున్నారు. రూ.500 పూజ పగడ చెట్టు సమీపంలోని రాయలవారి మండపం, మందుకొట్టెడ మండపాల్లో జరుగుతాయి. ఒక్కో మండపంలో దాదాపు 500 మంది మొత్తం వెయ్యి మంది వరకు ఒకే సారి పూజలు చేయించుకుంటారు. అలాగే రూ.750 పూజ కుమారుల మండపం, సాక్షి గణపతి ఆలయ మండపంలో జరుగుతుంది. అక్కడ ఒక్కో మండపంలో 300 మంది మొత్తం 600 మంది పూజ చేయించుకుంటారు. రూ.1,500 పూజ అద్దాల మండపం పక్కన కల్యాణోత్సవ మండపంలో జరుగుతాయి. అక్కడ ఒక్కసారికి 200 మంది పూజ చేయించుకుంటారు. పూజ పూర్తి కావస్తున్న సమయంలో సదరు పూజారులు దక్షిణ కింద 101 రూపాయలు చెల్లించాలని ప్రకటిస్తారు. లేకపోతే పూజాఫలం దక్కదని బెదిరిస్తారు. దీంతో భక్తులు చేసేది లేక వారు చెప్పిన 101 రూపాయి చెల్లిస్తున్నారు.

Illegal-Collections : పూజా ఫలం దక్కదట..

Illegal-Collections

అలాగే రూ.2500 పూజ ఆలయంలో ప్రధాన వినాయకుడి సన్నిధిలో జరుగుతుంది. అక్కడ ఒకేసారి 100 మంది పూజ చేయించుకోవచ్చు. ఇక్కడ పూజ పూర్తయ్యాక రూ.201 ఇవ్వాల్సిందే. రూ.5,000 రాహుకేతు సహస్ర లింగం సన్నిధిలో జరుగుతుంది. అక్కడ 50 జంటలతో పూజ నిర్వహిస్తారు. అక్కడ కనీసం వెయ్యి నుంచి వసూలు జరుగుతుంది. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా పూజ చేస్తారు. వారి నుంచి వచ్చే పైకం అదనంగా ఉంటుంది. భక్తులు రాహుకేతు పూజ టోకెన్ కొనుగోలు చేసి పూజలో కూర్చున్నాక.. పూజా పద్ధతిని వివరిస్తూ ఈ అదనపు దక్షణ గురించి ముందే చెబుతున్నారు. ఈ రాహుకేతు పూజా ఫలం దక్కాలంటే ఆయా మొత్తాల్లో ఇవ్వాల్సిందేనంటూ బెదిరిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పూజారులు అడిగినంతా చెల్లించేస్తున్నారు.

Illegal-Collections : క్షల్లో అక్రమ వసూళ్లు?

Illegal-Collections

శ్రీకాళహస్తీశ్వరాలయంలో రద్దీ లోని రోజుల్లో సగటున రోజుకు 2500 నుంచి 3000 మంది పూజ చేయించుకుంటారు. రద్దీ రోజుల్లో 6000 మంది వరకు రాహుకేతు పూజలు చేయించుకుంటారు. నెలకు సగటున 1,20,000 మంది నుంచి 1,30,000 వేల మంది వరకు రాహుకేతు పూజలు చేయించుకుంటారు. వీరందరి నుంచి పూజ రకాన్ని బట్టి అదనపు వసూలు చేస్తారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను బట్టి ఆ రోజు ఆదాయం ఆధార పడి ఉంటుంది. ఈ లెక్కన రాహుకేతు పూజల్లో పూజారుల వసూలు స్వామి వారి హుండీ ఆదాయాన్ని మించిపోయింది. గత మే 20న హుండీ లెక్కింపు జరిగింది. దాదాపు 40 రోజుల హుండీ ఆదాయం రూ.2.45 కోట్లు వచ్చింది. అదే రాహుకేతు పూజల్లో రోజుకు సగటున రూ.7 లక్షల నుంచి 8 లక్షల వరకు వస్తోంది. అంటే నెలకు దాదాపు రూ.2.2 కోట్లకు పైనే. అధికారిక లెక్కల్లో కనిపించని ఈ డబ్బు అంతా ఎవరి చేతుల్లోకి వెళ్తోంది, ఎలా పంపిణీ అవుతోంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశంపై సమగ్ర ఆడిట్‌, స్వతంత్ర విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

Illegal-Collections : కప్పం కట్టాల్సిందే

Illegal-Collections

రాహుకేతు పూజలు రాహుకాలంలో నిర్వహిస్తారు. వివిధ సమస్యలతో సతమతమవుతున్న భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో రాహుకేతు పూజలు చేయించుకుంటే తమ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే దేశంతో పాటు విదేశాల నుంచి భక్తులు వచ్చి పూజలు చేయించుకుంటారు. వారాంతం, సెలవులు, అలాగే మంగళవారం, శనివారం, ఆదివారం రోజుల్లో భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. అదే రాహుకేతు పూజ చేయించే పూజారులకు వరంగా మారింది. పూజా తంతు పూర్తయ్యే సమయంలో ఇవ్వాల్సిన దక్షణ గురించి మైక్‌లో ప్రకటిస్తారు. తరువాత ఒక సంచి లాంటి కవర్ తీసుకుని భక్తుల వద్దకు వెళ్లి వసూలు చేసుకుంటారు.

Illegal-Collections : ఎవరి వాటాలు వాళ్లకే

Illegal-Collections

అక్రమంగా వసూలు చేసిన నగదును సంబంధిత వ్యక్తులు పరస్పరం పంచుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్ల వ్యవహారం కేవలం కొందరు వ్యక్తులకే పరిమితం కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధుల స్థాయి వరకు వివిధ స్థాయిల్లో విస్తరించి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి ప్రభావవంతమైన వర్గాల వరకు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందన్న ప్రచారం సాగుతోంది. అందుకే ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదని, ఫిర్యాదులు వచ్చినా పెద్దగా చర్యలు కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మారదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. పారదర్శక పరిపాలన కోసం స్వతంత్ర విచారణ అవసరమని డిమాండ్ చేస్తున్నారు.

Illegal-Collections : అన్నీ తెలిసినా .. పాపం సామీ

Illegal-Collections

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ అధికారుల నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. భక్తులు, స్థానికులు పలుమార్లు సమస్యలను ప్రస్తావించినప్పటికీ సమగ్ర విచారణలు జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ వసూళ్లు నిజం కాకపోతే వాటిని ఖండించాలి. నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఆలయ పాలకవర్గం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. దేవస్థాన పరిపాలనపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి నిజానిజాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. దేవుడి సన్నిధిలో జరుగుతున్న వ్యవహారాలపై అధికారులు మౌనం పాటించడం వెనుక కారణమేంటన్న ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.

ALSO READ : 200-men-under-search : ట్విస్టులే ట్విస్టులు Andhra Prabha Top Story