Amaravati Construction Works | వర్షాల్లోనూ వేగంగా కొనసాగుతున్న రాజధాని పనులు

Amaravati Construction Works | వర్షాల్లోనూ వేగంగా కొనసాగుతున్న రాజధాని పనులు

అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్లు సహా కీలక ప్రాజెక్టులు పురోగతిలోనే..

Amaravati Construction Works | అమరావతి, ఆంధ్రప్రభ: అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన లోకేశ్.. అమరావతి నిర్మాణానికి ఇక ఎలాంటి విరామం ఉండదని, రాజధాని అభివృద్ధి పనులు టాప్‌ గేర్‌లో కొనసాగుతున్నాయని తెలిపారు. అమరావతి భవిష్యత్తుపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

వర్షం పడితే అమరావతి మునిగిపోయిందంటూ కొందరు విష ప్రచారం చేస్తున్నారని, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని ఏ నిర్మాణ స్థలంలోనూ పనులు నిలిచిపోలేదని, అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ఐకానిక్ టవర్లు, శాసనసభ భవనం, హైకోర్టు నిర్మాణం, ప్రధాన రహదారులు, రిజర్వాయర్లు, ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీల నివాస టవర్లు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

అమరావతి నిర్మాణ ప్రయాణంలో ఇక ‘పాజ్’ అనే మాటకు తావులేదని, నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాజధాని నిర్మాణమే బలమైన పునాది అవుతుందని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు అమరావతి కీలక కేంద్రంగా అవతరిస్తుందని, నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply