School bus safety | పాత బస్సులకు కొత్త రంగులు
School bus safety | పాత బస్సులకు కొత్త రంగులు
School bus safety | ఫిట్నెస్ లేని బస్సులతో ప్రమాద భయం పెరుగుతున్న ఆందోళన
భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు
డ్రైవర్ల అనుభవ లోపం – ప్రాణాంతక ప్రమాదాల హెచ్చరిక
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు కాకపోవడం – వ్యవస్థ వైఫల్యం
తల్లిదండ్రుల ఆవేదన – కఠిన చర్యల కోసం పెరుగుతున్న డిమాండ్
School bus safety | హైదరాబాద్, ఆంధ్రప్రభ: వేసవి సెలవులు ముగిసి సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాను న్నాయి. కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫామ్స్‌తో చిన్నారులు ఉత్సాహంగా బడిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వారిని సురక్షితంగా పాఠశాలకు చేర్చాల్సిన స్కూల్ బస్సుల పరిస్థితి చూస్తుంటే తల్లిదండ్రుల గుండెల్లో ఆందోళన, భయం పెరుగుతోంది.
రవాణా శాఖాధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 25,987 ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 22,158 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయి. మిగిలిన 3,829 బస్సులకు అనుమతి రాలేదని తెలిసింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 625 బస్సులు, మేడ్చల్-మల్కాజ్గిరిలో 531, ఖమ్మంలో 168, హైదరాబాద్ జిల్లాలో 165 బస్సులు ఫిట్నెస్ పరీక్షలకు దూరంగా ఉన్నట్లు తెలిసింది. అనుమతులు లేని ఈ వాహనాలు రోడ్డెక్కితే విద్యార్థుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన, వేదన వ్యక్తం చేస్తున్నారు.
రంగుల మాటున తుప్పు పట్టిన ఇంజిన్లు
రవాణా శాఖ నిబంధనల ప్రకారం స్కూల్ బస్సు కాలపరిమితి 15 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత ఆ వాహనాన్ని తుక్కు (స్క్రాప్)గా మార్చాలి. కానీ క్షేత్రస్థాయిలో చాలా పాఠశాల యాజమాన్యాలు ఈ నిబంధనను బేఖాతరు చేస్తూ అసహ్యకరమైన నిర్లక్ష్యం చూపుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన పాత బస్సులకు కొత్తగా పసుపు రంగు వేసి, లోపల ఇంజిన్ కండిషన్ పట్టించుకోకుండానే నడుపుతున్నారు. టైర్లు అరిగిపోయి, బ్రేకులు సరిగా పనిచేయని ఈ మృత్యుశకటాలు ఏ క్షణాన ఏ భయంకర ప్రమాదం సృష్టిస్తాయోనని తల్లిదండ్రులు వణికిపోతున్నారు.
దీనికి తోడు బస్సు కండిషన్ బాగున్నా డ్రైవర్‌కు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. అయితే తక్కువ జీతాల కోసం యాజమాన్యాలు లైసెన్స్ ఉన్న యువకులను డ్రైవర్లుగా నియమిస్తున్నాయి. వీరికి భారీ వాహనాలు నడిపిన అనుభవం లేకపోవడం, అతి వేగం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తోంది. గతంలో జరిగిన ప్రమాదాల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యపానం ప్రధాన కారణాలుగా తేలినా పరిస్థితిలో మార్పు రాకపోవడం చింతనీయమైన విషయంగా మారింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు బుట్టదాఖలు
స్కూల్ బస్సుల భద్రతపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ మెజారిటీ బస్సుల్లో ఇవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. బస్సు వేగం గంటకు 40 కి.మీ మించకూడదు. కానీ డ్రైవర్లు ఈ నిబంధనలను పాటించకుండా అతివేగంగా నడుపుతున్నారు. ప్రతీ కిటికీకి మూడు గ్రిల్స్, వెనుక భాగంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. కానీ చాలా బస్సుల్లో ఇవి తుప్పు పట్టి అత్యవసర సమయంలో పనిచేయని పరిస్థితి ఉంది.
గడువు ముగియని మందులతో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తప్పనిసరి ఉండాలి. బస్సులో ఆయా లేదా అటెండెంట్ ఉండాలి. కానీ చాలా యాజమాన్యాలు డ్రైవర్ ఒక్కడే బస్సు నడిపిస్తూ పిల్లల భద్రతను ప్రమాదంలో పెడుతున్నాయి.
ప్రతి ఏడాది పాఠశాలలు తెరిచే మొదటి వారం మాత్రమే రవాణా శాఖ అధికారులు హడావుడి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల తనిఖీలు చేసి జరిమానాలతో సరిపెడుతున్నారని, కానీ కఠిన చర్యల లోపం వల్ల సమస్యలు కొనసాగుతున్నాయని తల్లిదండ్రులు తీవ్రంగా వాపోతున్నారు. ఇప్పటికైనా రవాణా శాఖ కఠినంగా వ్యవహరించి, ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డెక్కకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
