భీమవరం బుల్స్ బీభత్సం..

భీమవరం బుల్స్ బీభత్సం..

104 పరుగుల భారీ తేడాతో వైజాగ్ లయన్స్ చిత్తు
బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏకపక్ష ఆధిపత్యం
రేవంత్ రెడ్డి, సాత్విక్ విధ్వంసకర ఇన్నింగ్స్
115 పరుగులకే కుప్పకూలిన సింహాద్రి వైజాగ్ లయన్స్
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బి. యశ్వంత్

విశాఖపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)–2026 ఐదో సీజన్‌లో భీమవరం బుల్స్ తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. శుక్రవారం ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై 104 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన భీమవరం జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్ చేసిన భీమవరం బుల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.

ఓపెనర్ రేవంత్ రెడ్డి కేవలం 34 బంతుల్లో 58 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అనంతరం బి. సాత్విక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 29 బంతుల్లో 63 పరుగులు సాధించిన అతను ఎనిమిది భారీ సిక్సర్లతో వైజాగ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నిర్ణీత 20 ఓవర్లలో భీమవరం బుల్స్ 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ తొలి నుంచే ఒత్తిడిలో పడింది. భీమవరం బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటింగ్ శ్రేణిని కుదేలు చేశారు.

మహిప్ కుమార్ 24 బంతుల్లో 36 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపించినా, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. వరుస వ్యవధుల్లో వికెట్లు కోల్పోయిన వైజాగ్ జట్టు 17.5 ఓవర్లలో కేవలం 115 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో భీమవరం బుల్స్ నెట్ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకోగా, సింహాద్రి వైజాగ్ లయన్స్ మాత్రం వరుస పరాజయాలతో టోర్నీలో ఇంకా విజయ ఖాతా తెరవలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమగ్ర ప్రతిభ కనబరిచిన భీమవరం జట్టు టైటిల్ రేసులో తమ బలమైన ఉనికిని మరోసారి చాటింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బి. యశ్వంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.