రెండేళ్ల కూటమి పాలన ఫలితాలు ప్రజల ముందే..

రెండేళ్ల కూటమి పాలన ఫలితాలు ప్రజల ముందే..

వైసీపీ వైఫల్యాలు బహిర్గతం: గోపు సత్యనారాయణ

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విశేష పురోగతి సాధించిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనతో పోలిస్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో దాదాపు 90 శాతం అమలు దశకు చేరుకోవడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2 వంటి పథకాల ద్వారా కోట్లాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని వివరించారు.

గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేలా అబద్ధపు ప్రచారాలు చేయడం, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం ఆ పార్టీ నాయకత్వానికి అలవాటుగా మారిందన్నారు.

ఉద్యోగాల కల్పనలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోందని, డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు, పోలీసు నియామకాలు, పరిశ్రమల పెట్టుబడుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాలు నిర్లక్ష్యానికి గురై యువత తీవ్ర నిరాశకు లోనైందని అన్నారు.

సామాజిక పింఛన్లను రూ.4 వేల వరకు పెంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించామని, మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల విడుదల చేసిన పుస్తకాలు, ప్రకటనలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, ప్రజలు ఇప్పటికే వారి పాలనకు తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మొటమర్రి బాబా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం టౌన్ మాజీ అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.