ఏపీఎల్ ఉత్కంఠ రసవత్తర పోటీ
ఏపీఎల్ ఉత్కంఠ రసవత్తర పోటీ
- విజయవాడ సన్‌షైనర్స్ ఘన విజయం
- తుంగభద్ర వారియర్స్ 1 వికెట్ థ్రిల్లర్ గెలుపు
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో వరుసగా జరిగిన రెండు మ్యాచ్‌లు అభిమానులకు ఉత్కంఠభరిత క్షణాలను అందించాయి. ఒకవైపు విజయవాడ సన్‌షైనర్స్ అద్భుత ప్రదర్శనతో కాకినాడ కింగ్స్‌పై ఘన విజయం సాధించగా, మరోవైపు తుంగభద్ర వారియర్స్–రాయలసీమ రాయల్స్ మధ్య జరిగిన పోరు చివరి బంతి వరకు సాగి 1 వికెట్ తేడాతో రసవత్తర ముగింపుకు చేరింది.
విజయవాడ అనూహ్య గెలుపు…

మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కాకినాడ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన విజయవాడ సన్‌షైనర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ అభినవ్ 36 బంతుల్లో 49 పరుగులతో జట్టుకు స్థిరత్వం అందించగా, చివర్లో జహీర్ అబ్బాస్ 11 బంతుల్లో 25 పరుగులతో వేగాన్ని పెంచాడు. లక్ష్యఛేదనలో కాకినాడ కింగ్స్ ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడింది.

టాప్, మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితమైంది. లేకాజ్ రెడ్డి 62 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. విజయవాడ తరఫున భరత్ 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించగా, జట్టు 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అభినవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చివరి బంతి వరకు ఉత్కంఠ..

రెండో మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్, రాయలసీమ రాయల్స్ మధ్య జరిగిన పోరు చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయలసీమ రాయల్స్ 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ ధృవకుమార్ రెడ్డి 51 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, ఎస్‌కే రషీద్ 41 పరుగులు చేశాడు. అయితే మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది.

బౌలింగ్‌లో తుంగభద్ర తరఫున వై. వాసు 3 వికెట్లు, ఐ. కార్తిక్ రమణ్ 2 వికెట్లు తీశారు. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తుంగభద్ర వారియర్స్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయినప్పటికీ జ్ఞానేశ్వర్ 28, జయంత్ 26, రోహిత్ 25, సౌరభ్ కుమార్ 21 పరుగులతో పోరాటం కొనసాగించారు. చివరి ఓవర్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, తుంగభద్ర వారియర్స్ 20 ఓవర్లలో 149/9 స్కోరు చేసి 1 వికెట్ తేడాతో విజయాన్ని ఖాయం చేసుకుంది.
