Fire | తృటిలో తప్పిన ప్రమాదం

Fire | తృటిలో తప్పిన ప్రమాదం

Fire | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో శనివారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా అగ్నికి ఆహుతికావడంతో స్థానికంగా కలకలం రేగింది.

వివరాల్లోకి వెళితే.. శ్రీ సిటీకి చెందిన ఎస్‌బీఎల్‌టీ బస్సు జాతీయ రహదారిపై జీరో పాయింట్ సమీపంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గ్రామాల నుంచి కార్మికులను శ్రీ సిటీలో దించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బస్సులో మంటలు వ్యాపిస్తున్నట్లు గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డుపక్కకు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.