Vijayawada కూటమి రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ..
Vijayawada కూటమి రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ..
హామీల వైఫల్యం, ప్రైవేటీకరణపై తీవ్ర విమర్శలు: మల్లాది విష్ణు
విజయవాడ (Vijayawada), ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల హామీల అమలులో విఫలం, నిరుద్యోగ సమస్య పెరుగుదల, ప్రైవేటీకరణ నిర్ణయాలు, ధరల పెరుగుదల, శాంతిభద్రతల పరిస్థితి దిగజారడం వంటి అంశాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
గాయత్రి కన్వెన్షన్ హాల్ నుంచి ముత్యాలంపాడులోని వైఎస్సార్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తీవ్రంగా విమర్శించారు. “సూపర్ సిక్స్”, “బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ” వంటి హామీలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని ఆయన ఆరోపించారు.
డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, మెరిట్‌కు బదులుగా డబ్బు, సిఫార్సులు ప్రాధాన్యం పొందుతున్నాయని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లోనూ అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రజా సొమ్ముతో నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని విమర్శించారు. మున్సిపల్ ఆస్తులను ప్రైవేటు చేతుల్లోకి తీసుకెళ్లే చర్యలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాలు నిర్వీర్యమవుతున్నాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పెరిగిందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. బుడమేరు వరదల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, వరద బాధితులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

