విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ అసిస్టెంట్ మృతి…

కోదాడ, ఆంధ్రప్రభ : కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ సమీపంలోని నెమలిపురి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దానిని పునరుద్ధరించే క్రమంలో ఓ తాత్కాలిక కార్మికుడు కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రెడ్డిబోయిన గోపి గ్రామంలో మీటర్ రీడర్‌గా పనిచేస్తూనే లైన్‌మెన్‌కు సహాయకుడిగా విధుల్లో సహాయపడుతుండేవాడు. నెమలిపురి గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్ అధికారుల సూచనల మేరకు సిబ్బందితో కలిసి గోపి విద్యుత్ స్తంభం ఎక్కాడు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ ఘాతానికి గురైన గోపి స్తంభంపైనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Leave a Reply