మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘టూ కె రన్’ నిర్వహణ
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘టూ కె రన్’ నిర్వహణ
కొత్తకోట, (ఆంధ్రప్రభ): మాదకద్రవ్యాల బారిన పడుతున్న యువత జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో ‘టూ కె రన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు మానవ ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతాయని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, బాధ్యతాయుతమైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. బస్ స్టాండ్ వద్ద మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాలతో కూడిన ప్లకార్డులు, చార్టులు, ఫోటో ఫ్రేమ్లతో సృజనాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, యువకులు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
