95-Crore-Scam : కమర్షియల్ కాదు.. డొమిస్టిక్కే Andhra Prabha Top Story
95-Crore-Scam : కమర్షియల్ కాదు.. డొమిస్టిక్కే Andhra Prabha Top Story
- రూ. 95 కోట్లు గుటుక్కు
- ఇది గ్యాప్ ఏజెన్పీల అల్పాహారం
- సివిల్సప్లయీస్ నియంత్రణ నిల్
- ఫిర్యాదే విజిలెన్స్ ఆయుధం
- ఏలూరు జిల్లాలో 40 శాతం హాంపట్
(ఆంధ్రప్రభ, ఏలూరుబ్యూరో.
యధేచ్చగా బహిరంగ మార్కెట్లో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కు వాడుతున్న వైనం ఇది. ఏలూరు జిల్లాలో నెలకు అనధికారికంగా గ్యాస్ ఏజెన్సీ జేబులోకి వెళ్తున్న సుమారు సొమ్ము 7 కోట్ల 87 లక్షల 57వేల రూపాయలు గా అంచనా . గృహ అవసరాలకు ఉపయోగించవలసిన సిలిండర్లను కమర్షియల్ కు తరలిస్తూ కోట్లాది రూపాయలను గ్యాస్ ఏజెన్సీలు మింగేస్తున్నాయింటే కేవలం ఆరోపణ కాదు. అణా పైసా పన్ను కట్టకుండా గ్యాస్ ఏజెన్సీలు నెలకు కేవలం ఒక్క ఏలూరు జిల్లా నుంచి రూ.7. 87 కోట్ల ఆదాయం బుక్కేస్తున్నారు. అదే మంటే తమకు నియంత్రణ అధికారం లేదని సివిల్ సప్లై అధికారులు తప్పించుకొంటున్నారు. కంప్లైంట్ వస్తేనే కానీ తనిఖీలు చేస్తామని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. జిల్లా మొత్తంలో 56 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా వాటిలో కమర్షియల్ గ్యాస్ ఏజెన్సీ కేవలం ఒక్కటి మాత్రమే ఉండడం గమనార్హం…..
95-Crore-Scam : ఏలూరు జిల్లాలో రూ.85 కోట్ల స్కామ్
గడచిన పదేళ్ల కాలంలో అనేక గ్యాస్ కంపెనీలు ప్రజల అవసరాల దృష్ట్యా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గృహ వినియోగ గ్యాస్ ను సరఫరా చేస్తూ తమ ఏజెన్సీలను విస్తరించుకుంటూ పోవడంతో వాడకం కూడా విస్తారంగా పెరిగింది. గ్యాస్ కంపెనీలు తమ ఉత్పత్తులను రెండుగా విభజించి ఒకటి ప్రధానంగా గృహ అవసరాల కోసం రెండవది వ్యాపార అవసరాల కోసం అనే విభాగాలుగా విభజించి వాటి ధరలను కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు గ్యాస్ కంపెనీలు నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో వ్యాపార అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధర గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ కంటే రేటు వ్యత్యాసం చాలా ఎక్కువ ఉండడమే డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది.
95-Crore-Scam : డొమిస్తిక్కే.. కమర్షియల్ గురూ
గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర కొద్దిపాటి తక్కువగా ఉండటం వ్యాపార అవసరాలకు వినియోగించే వారికి అవకాశం గా మారడం అదే సమయంలో ఏజెన్సీ డీలర్ కు గ్యాస్ కంపెనీ యాజమాన్యం నిర్ణయించే టార్గెట్లను చేరుకోవడం కోసం కంపెనీ సేల్స్ ఆఫీసర్లు సైతం గృహ అవసరాల సిలిండర్లను యథేచ్చగా మార్కెట్లో వ్యాపార అవసరాలకు వినియోగించే విధంగా వ్యాపారస్తులను ప్రోత్సహిస్తున్నారు. ఈ విధమైన వ్యాపారం కొనసాగించడం వల్ల ఏజెన్సీ వారికి 500 రూపాయలు అదనంగా మిగులుతుంది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ప్రస్తుత ధర వినియోగదారునికి 975 రూపాయలు కాగా డిమాండ్ ను బట్టి మరొక 500 రూపాయలు అదనంగా వసూలు చేస్తూన్నారు. ఈ వ్యాపారం ఉభయ కుశులోపరి గా ఉండడంతో చాప కింద నీరులా విస్తరించి ప్రస్తుతం ఏజెన్సీదారులకు కాసులు వర్షం కురిపిస్తుంది. వ్యాపారస్తులు అదనంగా 500 ఖర్చు పెట్టినా కానీ, తక్షణమే అందుబాటులో ఉండడం తో నిత్యం రెండు మూడు సిలిండర్లు వాడేవారు సైతం కమర్షియల్ సిలిండర్క కు పోకుండా గృహ అవసరాలకు వాడే సిలిండర్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ దందా మూడు పూవ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతుంది. గృహ అవసరాలకు వాడే సిలిండర్ కు (కేజీ 68.67 రూపాయలు కాగా,) వ్యాపార అవసరాలకు వాడే సిలిండర్ 3 వేల314 రూపాయలు ఉండగా ( కేజీ 174.50 రూపాయలు) ఉండగా 100 రూపాయలు కేజీకి రేటు వ్యత్యాసం ఉన్న కారణంగా గృహ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 14.2 కేజీల సిలిండర్లను యధేఛ్ఛగా వ్యాపారస్తులు తమ వ్యాపారావసరాల కొరకు వినియోగిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు తనిఖీ చేసినా చిన్నపాటి కేసులతో వ్యాపారస్తులు తప్పించుకోవడం పరిపాటిగా మారింది. కేవలం ఒక్క ఏలూరు జిల్లాలోని ఉన్న 55 ఏజెన్సీలకు గాను, ఆరు లక్షల 30 వేల 55 కనెక్షన్లు యాక్టివ్ గా ఉండగా వాటిలో 25శాతం ఇన్ ఆక్టివ్ గా ఉన్నాయని ఏజెన్సీ దారిలో అంగీకరిస్తున్నారు. ఈ ఇనాక్టివ్ గా ఉన్న కనెక్షన్స్ మాత్రమే వారి పాలిట కల్పతరువుగా మారి ప్రతి నెలకు ఏడు కోట్ల 87 లక్షల రూపాయలు అదనంగా పొందుతున్న ఏజెన్సీలు వారు సంవత్సరం మొత్తానికి లెక్క చూసినట్లయితే 94 కోట్ల 50 లక్షల 84వేల అదనపు ఆదాయం ఆర్జిస్తూ ప్రభుత్వానికి కనీసం చిల్లిగవ్వ కూడా టాక్స్ గా చెల్లించకుండా జేబులు నింపుకుంటున్నారు.
95-Crore-Scam : 40 శాతం గుటుక్కు
తమకు ఈ విధమైన మార్కెటింగ్ చేయడానికి గల కారణం కంపెనీ నుండి టార్గెట్ల రూపంలో వత్తిడి ఉంటుందని, అది పూర్తి చేయటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తూతున్నామంటూ, ఈ ప్రక్రియను కంపెనీ సేల్స్ ఆఫీసర్లకు సైతం తెలిసినంటూ, కంపెనీలపై నెట్టే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి ఆధికంగా 500 రూపాయలు ఒక సిలిండర్ నిమిత్తం ఏజెన్సీ అధికారులు లబ్ధి పొందుతున్న విషయాన్ని అంగీకరించకపోగా, ఒక్క ఏలూరు జిల్లాలో 55 ఏజెన్సీలు ఉండగా సగటున ఒక్కో ఏజెన్సీకి 9 వేల నుంచి 11వేల వరకు వినియోగదారులు ఉండగా, జిల్లా వ్యాప్తంగా 6లక్షల 30 వేల వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఇక ఒకే వినియోగదారుడు ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు కలిగి ఉన్నవారు అదనంగా ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఎన్ని గృహ అవసరాల సిలిండర్లను గృహ అవసరాలకు సరఫరా చేస్తున్నారు, మిగిలినవి అనధికారికంగా అధిక మొత్తంలో ( ఒక్కొక్క సిలిండర్ కు 500 రూపాయలు ఇది కేవలం 25 శాతం ఇన్ యాక్టివ్ గా ఉన్న కనెక్షన్ల నిమిత్తమే) తమ ఖాతాలో డీలర్లు జమ చేసుకుంటున్నారు అన్న విషయాన్ని నిశితంగా పరిశీలించగా 40శాతం గృహ అవసరాల సిలిండర్ లను అనధికారికంగా బహిరంగ మార్కెట్లో యథేచ్చగా అమ్ముతున్నట్లు కేవలం 60 శాతం మాత్రమే గృహ అవసరాలకు వినియోగిస్తున్నట్లుగా విశ్వసినీ సమాచారం.
రాష్ట్రంలో నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలిపిన లెక్కల ప్రకారం ఒక కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని అందులో ఒక కోటి 39 లక్షల కనెక్షన్స్ మూడు సిలిండర్లు ఉచితం పథకానికి అర్హులుగా ఉన్నారని సివిల్ సప్లైస్ ఉన్నత అధికారులే తెలిపిన విషయం పాఠకులకు విధాతమే. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న భారత్, ఇండియన్, హెచ్.పి గ్యాస్ ఏజెన్సీలు తమ వద్ద ఉన్న గృహ అవసరాల కోసం వినియోగించవలసిన గ్యాస్ సిలిండర్లను సుమారు 40% వ్యాపార అవసరాలకి దొడ్డిదారిన మళ్లిస్తూ, అదనంగా వసూలు చేస్తున్న 500 రూపాయలను అనధికారికంగా జేబులల్లో నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతినెల రాష్ట్రవ్యాప్తంగా డొమెస్టిక్ నుండి కమర్షియల్ కు అనధికారికంగా తరలిస్తున్న సిలిండర్లు 18, లక్షల 90 వేల 168 కాగా వీటి విలువ అదనంగా వసూలు చేస్తున్న 500 రూపాయలు విలువ సుమారు94 కోట్ల 50 లక్షల 84 వేల రూపాయలు కాగా ఇది కేవలం ఒక్క సంవత్సరానికి మాత్రమే.
95-Crore-Scam : సివిల్ సప్లై నియంత్రణ శూన్యం
గతంలో తమకు ఈ విభాగంపై నియంత్రణ అధికారం ఉండేదని ప్రస్తుతం వినియోగదారుడు ఫిర్యాదు మేరకే తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఆ సందర్భంలో దొడ్డిదారిన తరలిస్తున్న సిలిండర్ల వ్యవహారం తమ నోటీసుకు రాదని వినియోగదారుడు కేవలం వ్యక్తిగత ఫిర్యాదులు మాత్రమే నమోదు చేస్తున్నారని, గతంలో ఏజెన్సీల వారికి అనుమతులు మంజూరు చేయడమే కాకుండా కాలపరిమితి పూర్తి అవ్వడానికి ఆరు నెలలు ముందుగానే వారికి సమాచారం అందజేసి రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా సమాచారం ఇచ్చి రెన్యువల్ కు ముందు మరొకసారి తనిఖీ చేసేవారమని, ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికి వన్ టైం లైసెన్స్ విధానాన్ని అమలు చేయడం ద్వారా వాటిపై నియంత్రణ కోల్పోయామని ఒక్కసారి అనుమతి పొందినట్లయితే వారు జీవితకాలం కాల పరిమితం లైసెన్స్ అనుమతులు ఉంటున్నాయని, కేవలం సిలిండర్ లీకేజీ, సిలిండర్ తూకంలో హెచ్చుతగ్గులు, డెలివరీ బాయ్ అదనంగా డబ్బులు వసూలు చేయడం వంటివి మాత్రమే వినియోగదారులు తమకు ఫిర్యాదు చేస్తున్నారని, వాటిపై తక్షణమే స్పందించి ఉన్నతాధికారులకు తగు నివేదికను సమర్పించడం ఎప్పటికప్పుడు జరుగుతోందని సివిల్ సప్లై అధికారులు తెలిపారు.
95-Crore-Scam : దొడ్డి దారే రాజమార్గం
దొడ్డి దారిలో తరలిస్తున్న సిలిండర్లకు ఆధారాలుగా అనేకమంది ఫోటోలు రూపంలో పంపించినప్పటికీ ఏ ఏజెన్సీ నుంచి ఎవరికి తరలిస్తున్నారు, ఎవరు తరలిస్తున్నారు. అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో తగు చర్యలు తీసుకోలేకపోతున్నామని, రాతపూర్వక ఫిర్యాదులు తగు ఆధారాలతో సామాన్య మానవులు సైతం ఫిర్యాదు చేసినట్లయితే విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి తగిన చర్యలు చేపడతారని, రాతపూర్వక ఫిర్యాదు లేనట్లయితే విజిలెన్స్ అధికారులు సైతం గ్యాస్ ఏజెన్సీ లపై గాని, దొడ్డిదారిన వచ్చిన సిలిండర్లను ఉపయోగిస్తున్న వారిపై గాని, తగు చర్యలు విజిలెన్స్ అధికారులు సైతం అమలుపరిచే పరిస్థితులు లేవని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఈ తరహా పరిస్థితులు కొనసాగుతున్నంతకాలం దొడ్డిదారిన జరిగే సిలిండర్ల బాగోతానికి తెరపడే అవకాశాలు లేవని, ఫలితంగా లక్షల కోట్ల రూపాయలకు పైసా కూడా పన్ను చెల్లించకుండా ఏజెన్సీలు యజమానులు జేబులో నింపుకోవడం కొనసాగుతూనే ఉంటుందని అధికారులు తెలిపారు.
