గ్రామ పంచాయతీ విభజనపై అసంతృప్తితో గ్రామస్తులు..
గ్రామ పంచాయతీ విభజనపై అసంతృప్తితో గ్రామస్తులు..
- స్వచ్ఛ గాం, సురక్షిత్ జల్ వాయు గ్రామ సభను బహిష్కరించిన వెంకటాపూర్ గ్రామస్తులు.
- అధికారులకు వినతిపత్రం అందజేత
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం వెంకటాపూర్ (వందుర్ గూడ) గ్రామ పంచాయతీ విభజన వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. తమ గ్రామాన్ని అశాస్త్రీయంగా, ఎటువంటి అర్హతలు లేకుండా విభజించారంటూ గ్రామస్తులు నిరసన బాట పట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గాం, సురక్షిత్ జల్ వాయు’ క్యాంపెయిన్ లో భాగంగా నిర్వహించాల్సిన గ్రామ సభను బుధవారం బహిష్కరిస్తున్నట్లు గ్రామ పటేల్ కోవ దౌలత్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వందూర్ గూడ గ్రామాన్ని రాజకీయ ఒత్తిళ్లతో, తప్పుడు నివేదికల ఆధారంగా వెంకటాపూర్ నుండి విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గ్రామస్తులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వాస్తవాలను పరిశీలించిన కోర్టు, అధికారుల నివేదికలు తప్పుగా ఉన్నాయని నిర్ధారిస్తూ, పాత నెల్కి వెంకటాపూర్ పంచాయతీని యథావిధిగా కొనసాగించేలా పునః పరిశీలన చేయాలని గత 11 నెలల క్రితమే ఆదేశించిందన్నారు.
అయితే, ఇప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపై గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.అనంతరం గ్రామస్తులు.ఎన్ ఆర్ ఈ జి ఎస్, ఈ సి ప్రత్యేక అధికారి భీమయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ లకు వినతి పత్రంఅందజేసి తమ నిరసనను స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరగడం బాధాకరమన్నారు. మా గ్రామాన్ని విడదీయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
పాత నెల్కి వెంకటాపూర్ పంచాయతీని పునరుద్ధరించే వరకు నిరసనలు కొనసాగుతాయి అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారు ప్రత్యేక అధికారిని కోరారు.న్యాయస్థానం ఆదేశాలు అమలు కానంత వరకు ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరిస్తూనే ఉంటామని గ్రామస్తులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో,బిర్షావ్,టెకం భీంరావు,కోవ తిరుపతి, ధర్మారావు,అడాయి,చందు,బాగవంత్ రావు,గ్రామస్తులు పాల్గొన్నారు.
