పేదల సంక్షేమంపై చిత్తశుద్ధితో ప్రభుత్వం
పేదల సంక్షేమంపై చిత్తశుద్ధితో ప్రభుత్వం
- విప్ చింతకుంట విజయరమణరావు
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్, ఆంధ్రప్రభ: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించడంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.
మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 66 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.66,07,656 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లను మంజూరు చేయగా, జూన్ చివరి నాటికి రెండో విడతలో అదనంగా 2,000 ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
గ్రామాల్లో జనాభా ఆధారంగా అర్హులైన పేదలను గుర్తించి ఇళ్లను కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మృగశిర కార్తె ప్రారంభమైనందున రైతులు ఆలస్యం చేయకుండా నార్లు పోసుకోవాలని, తక్కువ రోజుల్లో (105 రోజుల్లో) చేతికొచ్చే వరి రకాలను ఎంచుకోవాలని సూచించారు. ఆలస్యమైతే దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు.
వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, మొక్కజొన్న, కందులు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వాటికి మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తోందని, రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పనులను చూసి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, ఎంపీడీఓ దివ్యదర్శిని, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచులు, నాయకులు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.
