25-World-Records : ప్రశ్న ప్రశ్నకు.. టక టక…Andhra Prabha Top Story

25-World-Records : ప్రశ్న ప్రశ్నకు.. టక టక…Andhra Prabha Top Story

  • ఐదున్నరేళ్ల ప్రాయంలో,, .
  • 25 ప్రపంచ రికార్డులు
  • ఈ నిఠాలాక్షిరామ బాలమేధావి
  • మంత్రి కందుల ఆశ్చర్యం

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్)​

25-World-Records : మూడేళ్ల వయసు నుంచే ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ, ఐదున్నరేళ్ల ప్రాయంలోనే ఏకంగా 25 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న రాజమహేంద్రవరానికి చెందిన బాలమేధావి డి.నిఠలాక్షరామను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కందుల దుర్గేష్ అభినందించారు. ఇటీవల ప్రతిష్టాత్మక ‘నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సాధించిన చిన్నారి నిఠలాక్షరామ.. తన తల్లిదండ్రులతో కలిసి రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి సాధించిన రికార్డులు, ప్రశంసాపత్రాలను మంత్రి ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం నిఠలాక్షరామకు 25వ నోబుల్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్‌ను ప్రదానం చేయడమే గాక మెడలో మెడల్ ను స్వయంగా వేసి ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సత్కరించారు.రాజమండ్రి బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్‌లో యూకేజీ పూర్తి చేసిన ఈ చిన్నారి.. రెండు చేతులతోనూ అలవోకగా రాయగల అరుదైన కళను వంటబట్టించుకోవడం చూసి మంత్రి దుర్గేష్ అబ్బురపోయారు.

25-World-Records : మంత్రి ప్రశ్నలు.. పాప టక టక జవాబు

చిన్నారితో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్.. అతని అసాధారణ తెలివి తేటలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలతో పాటు సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆ చిన్నారి గుక్కతిప్పుకోకుండా అనర్గళంగా సమాధానాలు చెప్పడం విశేషం. కాన్సెప్ట్ చెప్పగానే వెంటనే మైండ్‌లో భద్రపరుచుకునే ఈ బుడ్డోడిని మంత్రి ‘ఏకసంథాగ్రాహి’ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కిడ్స్ శ్లోకాల పోటీల్లో పాల్గొని 150కి పైగా షీల్డ్‌లు, 100కి పైగా మెడల్స్ సాధించినందుకు అభినందించారు. ఇవే గాక వంశవృక్షాలు, షడ్చక్రాలు, అధిష్టాన దేవతల వంటి క్లిష్టమైన టాపిక్స్‌పై అశేష జ్ఞానాన్ని కలిగి ఉండటమే కాకుండా, కవితలు అల్లగలగడం ఈ చిన్నారి ప్రత్యేకత అని తల్లిదండ్రులు తెలిపారు. అంతేగాక ఇటీవల తన అద్భుతమైన మేధస్సుతో అమెరికాలో డాలర్స్ సంపాదించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నట్లు వారు పేర్కొన్నారు.

25-World-Records : ఈమె రాజమండ్రి పాప

రాజమహేంద్రవరానికి చెందిన కాత్సాయని పీఠ ప్రముఖ వాస్తు పండితులు డా. శ్రీనివాసరావు, రసజ్ఞ దంపతులు చిన్నతనం నుంచే బాబుపై ప్రత్యేక దృష్టి పెట్టి, సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ చేయిస్తూ ఇలా తీర్చిదిద్దడం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ ఈ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో ఈ చిన్నారి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాలని మంత్రి దుర్గేష్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.