ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రకృతి వ్యవసాయం..
ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రకృతి వ్యవసాయం..
జగ్గయ్యపేటలో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ:
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే తక్కువ వర్షపాతం పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అమలు చేస్తున్న ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం రైతులకు కొత్త భరోసాను అందిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో కాంపాక్ట్ బ్లాక్ పరిధిలో 10 ఎకరాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రధాన పంటగా సాగవుతున్న బొప్పాయి తోటల్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి పంటల వైవిధ్యాన్ని పెంచుతున్నారు.
వర్షాలు ప్రారంభమయ్యే ముందే విత్తనాలు చల్లడం ద్వారా నేలలో తేమ లభించిన వెంటనే మొలకలు రావడం, పంటల పెరుగుదల వేగవంతం కావడం ఈ విధానం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఒకే పొలంలో పలు రకాల పంటలను సాగు చేయడం వల్ల మట్టి సారవంతత పెరగడంతో పాటు నీటి వినియోగం తగ్గుతోంది.
అంతేకాకుండా రైతులకు ఒకే పంటపై ఆధారపడకుండా స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం కలుగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నా పంటల నిలకడను కాపాడడంలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. విత్తన గుళికల తయారీ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విత్తనాలకు ప్రత్యేక పూత పూయడం ద్వారా మొలక శాతం పెరగడం, ఎండలకు తట్టుకునే సామర్థ్యం మెరుగుపడడం, పంటల ఎదుగుదల బలపడడం జరుగుతుందని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వి. నాగ ప్రమీల రాణి మాట్లాడుతూ, రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్, విత్తన గుళికల వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా స్వీకరించాలని సూచించారు. ఇవి ఖర్చులు తగ్గించడంతో పాటు స్థిరమైన దిగుబడులు, మెరుగైన ఆదాయం అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌కే సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.
