కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి..
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి..
- తాటిపాముల వెంకట్రాములు
కరీమాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహా ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో తెలియజేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ తో దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం అత్యంత దుర్మార్గమైనదన్నారు. రైతు కూలీల ,బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎన్నో కష్టాలకు ఓర్చి పరీక్షలు రాస్తే వారికి నిరాశే ఎదురయిందన్నారు.
పేదలు సామాన్య ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అప్పులు చేసి ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు పంపించి చదివిస్తే ప్రశ్నాపత్రాలు లీకై పరీక్షలు రద్దు కావడంతో వారు పడిన మనోవేదన చెప్పనలవి కానిదన్నారు. మానసిక క్షోభతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు గురి కావడం చాలా బాధాకరమన్నారు. గతంలో అనేకసార్లు ప్రశ్నాపత్రాలు లీకేజీలు జరిగిన నిర్దిష్టమైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వలన మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లీకేజీలకు కారకులైన వారిపై ఇంతవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు.
యుద్ధ ప్రాతిపదికన సమగ్రమైన విచారణ జరిపించి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండ చూడాలన్నారు. ప్రశ్నాపత్రాలు లీకేజీలు కాకుండా ఉండటానికి నిపుణులు సూచించిన విధంగా ఆన్లైన్ విధానంలో ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు ఇంకా ఉధృతం కాకముందే కేంద్ర విద్యా శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని లేకుంటే రాష్ట్రపతి వెంటనే ఆయనని బర్తరఫ్ చేయాలని వెంకట్రాములు డిమాండ్ చేశారు.
