పీసీబీ ఆఫీస్‌ ముట్టడి..

పీసీబీ ఆఫీస్‌ ముట్టడి..

దున్నపోతు ఫ్లెక్సీలతో కాలుష్య బాధితుల నిరసన

చౌటుప్పల్‌, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ డివిజన్‌లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలో రసాయన పరిశ్రమల కాలుష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

పీసీబీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ‘అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి’ ప్రతినిధులు, గ్రామస్తులు కలిసి తమ సమస్యలను వివరించారు. పరిశ్రమల కాలుష్యం వల్ల ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులపై మంత్రికి వినతిపత్రం అందజేశారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో సుమారు 100 మంది గ్రామస్తులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో పీసీబీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన పీసీబీ అధికారులు పరిశ్రమల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

కింది స్థాయి అధికారులు నివేదికలు ఇచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. పీసీబీ ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ దున్నపోతు చిత్రంతో ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శించి వినూత్నంగా నిరసన తెలిపారు.

రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డికి చెందిన హెటిరో గ్రూపు అనుబంధ ‘హజలో లాబరేటరీస్‌’ పరిశ్రమ నుంచి ప్రాణాంతక విషవాయువులు, తీవ్రమైన దుర్వాసన వస్తున్నాయని కాలుష్య విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు గుమ్మి దామోదర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై జిల్లా అధికారులు నివేదికలు ఇచ్చినా పీసీబీ మెంబర్‌ సెక్రటరీ చర్యలు తీసుకోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.