ప్రతిఒక్కరూ తల్లి పేరిట మొక్కను నాటాలి..
కొండపల్లి హస్తకళాకారుల కోసం 10 వేల తెల్లపొనికి చెట్లు
అంతరించిపోతున్న కళల పరిరక్షణకు ఉడ్ బ్యాంక్స్
భవిష్యత్ తరాల కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం
మహిళలతో కలిసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన డీసీఎం
మూలపాడు బటర్ ఫ్లై పార్కులో డ్రోన్ సాయంతో సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియ వీక్షణ
ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్), ఆంధ్రప్రభ : ‘ఏక్ పేడ్ మా కే నామ్’ థీమ్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ తల్లి పేరిట మొక్కను నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్కు నగర వనంలో శుక్రవారం ఉదయం తన తల్లి అంజనాదేవి పేరిట పవన్ కళ్యాణ్ తెల్ల పొనికి మొక్కను నాటారు. రాష్ట్రాన్ని పచ్చగా మార్చి వాతావరణ మార్పుల నుంచి కాపాడాలని ఆయన కోరారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారు.

స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, మూలపాడు గ్రామస్థులతో కలిసి అంకుడు, తెల్లపొనికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ తదితర స్వదేశీ జాతి విత్తనాలతో పవన్ కళ్యాణ్ సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 15 వరకు పది రోజుల పాటు అన్ని జిల్లాల్లో సీడ్ బాల్స్ తయారీని ఉద్యమంలా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎర్ర బంకమట్టి, కంపోస్ట్ తో పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నట్లు వివరించారు. వర్షాకాలంలో రాష్ట్రమంతా వీటిని చల్లేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. కొండలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో అధునాతన డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ చల్లుతామన్నారు.
భూమిని, పచ్చదనాన్ని కాపాడుకోవడం అందరి కనీస బాధ్యత అన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే మొక్కలు నాటి సంరక్షించడం తప్పనిసరి అన్నారు. కొండపల్లి బొమ్మల కళాకారుల కోసం 10 వేల తెల్ల పొనికి చెట్లు నాటుతున్నామని చెప్పారు. అంతరించిపోతున్న సంప్రదాయ కళల పరిరక్షణకు ఉడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి కళకు జీవం పోస్తామని తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ తయారీకి అవసరమైన చెట్లను పెంచుతామన్నారు.
రెండు నెలల్లో ప్రాంతాల వారీగా ఉడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పద్మశ్రీ వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని అడవులను కాపాడుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా చెట్లుగా మారే వరకు సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా 300 ప్రాంతాల్లో సీడ్ బాల్స్ తయారీ
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూలపాడు బటర్ ఫ్లై పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ వీక్షించారు. సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ప్రజలతో ముచ్చటించారు. ఏఏ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు? ఎంత మొత్తంలో రూపొందిస్తున్నారు? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. వన సంరక్షణకు పని చేస్తున్న మహనీయుల స్ఫూర్తితో విత్తన బంతుల తయారీ ప్రక్రియను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. సీడ్ బాల్స్ ఆవశ్యకతను వివరించిన చిన్నారులను అభినందించారు. జూన్ 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ రూపొందించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అనంతరం డ్రోన్ల సాయంతో కొండ శిఖరాలపై విత్తన బంతులు జారవిడిచే ప్రక్రియను పరిశీలించారు.
ప్రతి ఎకో పార్కులో ఒక యోగా హాల్
అంతకు ముందు మూలపాడు బటర్ ఫ్లై పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. బటర్ ఫ్లై పార్కు నమూనా పరిశీలనలో అక్కడ యోగా హాల్ నిర్మాణం ఆయనను ఆకట్టుకుంది. ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్ నిర్మించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కొయ్య బొమ్మలు, కళాకృతుల ప్రచారానికి హామీ
అనంతరం కొండపల్లి కొయ్య బొమ్మలు తయారీకి వినియోగించే తెల్లపొనికి దుంగలను పరిశీలించారు. పక్కనే ఏర్పాటు చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారులు నిర్ధ, బిళ్ల నిర్ధ, వేప కర్రతో తయారు చేసిన గ్లాసులు, గరిటలు వంటి వంటింటి సామగ్రిని ఆసక్తిగా తిలకించారు. కళాకారులు రూపొందించిన చెక్క వాచ్, ల్యాప్ టాప్ ను చూసిన పవన్ కళ్యాణ్ ముగ్ధులయ్యారు. చిత్తూరు నుంచి విచ్చేసిన కళాకారులు బొమ్మల తయారీకి అవసరమైన చెక్క లభించడం లేదని తెలుపగా, ఉడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల కళాకారులతో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రతిమను తయారు చేయించాలని కోరారు.
అద్భుతమైన కళారూపాలకు మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రచారం ద్వారా ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రెండు నెలలకు ఒక ప్రాంతంలో చేతి వృత్తుల కళాకారులను కలిసే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సలహాదారుడు మల్లికార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహన రావు (గాంధీ) తదితరులు పాల్గొన్నారు.
