తిరుమలలో ఏఐ సేవలపై కేంద్ర మంత్రి ప్రశంసలు..

తిరుమలలో ఏఐ సేవలపై కేంద్ర మంత్రి ప్రశంసలు..

‘ఏక్ పేడ్ మా కే నామ్’లో మొక్క నాటిన పీయూష్ గోయల్

తిరుమల, ఆంధ్రప్రభ: తిరుమలలో భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరు ప్రశంసనీయమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

శుక్రవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వసతి గదుల లభ్యత, భక్తుల రాకపోకలు, దర్శన క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదాల పంపిణీ వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల భక్తులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని తెలిపారు.

ఈ కేంద్రం ద్వారా గదుల లభ్యత, వివిధ కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తుల సంఖ్య, గంటల వారీగా తిరుమలకు చేరుకుంటున్న భక్తుల వివరాలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ సమాచారం తక్షణమే అందుబాటులోకి వస్తోందని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సాంకేతికతను ప్రోత్సహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన ప్రవాస భారతీయ భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కేవలం 100 రోజుల లోపే ఏఐ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ అధికారులను అభినందించారు.

అంతకుముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. తిరుమలలో తన తల్లి పేరుతో మొక్క నాటడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.

ప్రతి చిన్నారి తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి, జీవితాంతం దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.

ప్రతి ఏడాది జూన్ తొలి వారంలో తన జన్మదినం సందర్భంగా తిరుమలను సందర్శించి శ్రీవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. దేశ సేవకు, ప్రజల సంక్షేమానికి మరింత కృషి చేసేలా శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు.