క్షేత్రస్థాయిలో మరింత చురుకుదనం..!
క్షేత్రస్థాయిలో మరింత చురుకుదనం..!
ఆముదాలవలస, ఆంధ్రప్రభ: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయాలని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ Koona Ravi Kumar పార్టీ నాయకులకు సూచించారు.
గురువారం ఆముదాలవలస మండలంలోని కొత్తరోడ్ జంక్షన్ సమీపంలోని కన్వెన్షన్ హాల్‌లో క్లస్టర్ ఇన్‌చార్జీలు, యూనిట్ ఇన్‌చార్జీలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లతో ప్రత్యేక అవగాహన, సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాలు, వార్డుల స్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సూచించారు.
అదేవిధంగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)పై బూత్ స్థాయి నాయకులకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, తొలగింపులు, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రతి అర్హుడైన వ్యక్తి ఓటరు జాబితాలో పేరు నమోదు అయ్యేలా బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, పకడ్బందీగా ఉన్న ఓటరు జాబితా ఎన్నికల ప్రక్రియకు కీలకమని పేర్కొన్నారు.
పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జీలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో వివిధ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, యూనిట్ ఇన్‌చార్జీలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
