గల్లంతైన మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించారు..

  • ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖకు చెందిన 10 మంది మత్స్యకారులు సురక్షితం
  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : విశాఖపట్నం నుంచి వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా ఒక మత్స్యకారుడిని సురక్షితంగా రక్షించినట్లు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

జూలై 5వ తేదీ ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవీ యూనివర్స్ వెల్తీ మర్చంట్ నౌక సిబ్బంది సముద్రంలో కొట్టుకుపోతున్న మత్స్యకారులను గుర్తించారు. వెంటనే నౌక కెప్టెన్ అత్యవసర సహాయక చర్యలు ప్రారంభించి, లైఫ్ రింగులు, తాళ్ల సహాయంతో ఒక మత్స్యకారుడిని ఉదయం 7:50 గంటల ప్రాంతంలో సురక్షితంగా రక్షించారు.

అయితే ఆ సమయంలో బలమైన గాలులు, సుమారు మూడు మీటర్ల ఎత్తులో అలలు ఉండటంతో పాటు సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉండడం వల్ల మిగిలిన మత్స్యకారులు కనిపించకుండా పోయారని నౌక కెప్టెన్ సమాచారం అందించినట్లు మంత్రి తెలిపారు.

తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రెస్క్యూ బోటును సముద్రంలోకి దించడం కూడా సాధ్యపడలేదని వివరించారు. కాకినాడ నుంచి ప్రత్యేక నౌక తెప్పించి హెలికాప్టర్లతో కూడా గాలింపు చేసామని వెల్లడించారు. ప్రస్తుతం మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం భారత కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీస్, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు.

గల్లంతైన ప్రతి మత్స్యకారుడిని సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. గల్లంతైన వారిలో కారి గంగయ్య, అమర అప్పలరాజు, కారి సితోడు, మేడ చిన అమ్మోరు, కారి చిన్నయ్య, రాగుతూ బండియ్య ఉన్నారని , ప్రాణాలకు తెగించి కారి చిన్న మత్స్యకారుడిని రక్షించిన మర్చంట్ నౌక కెప్టెన్, సిబ్బందికి మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఒడిశా తీరంలో 10 మంది మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు..

ఒడిశా తీరంలో సాంకేతిక లోపం కారణంగా చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోటులో ఉన్న బోటు యజమాని దానయ్యతో పాటు మొత్తం 10 మంది మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బోటు ఇంజిన్ పనిచేయకపోవడం, యాంకర్ కోల్పోవడంతో మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నట్లు సమాచారం అందిన వెంటనే ఒడిశా మెరైన్ పోలీస్, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

మంత్రి ఆదేశాల మేరకు ఒడిశా మెరైన్ పోలీస్, మత్స్యశాఖ అధికారులు వేగంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బోటు యజమాని దానయ్యతో పాటు మొత్తం 10 మంది మత్స్యకారులను సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా సకాలంలో స్పందించి మత్స్యకారుల ప్రాణాలను కాపాడిన ఒడిశా ప్రభుత్వం, ఒడిశా మెరైన్ పోలీస్, మత్స్యశాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రక్షించబడిన మత్స్యకారులను వారి స్వస్థలమైన విశాఖపట్నానికి చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.