భవిష్యత్ తరాల కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి: చైర్మన్ గీత
భవిష్యత్ తరాల కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి: చైర్మన్ గీత
చిట్యాల, ఆంధ్రప్రభ:
భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణం, సమృద్ధిగా నీటి వనరులను అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ అన్నారు.
గురువారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు, ఆరో వార్డులోని వెంకటాపురంలో ప్రజా పాలన పట్టణ ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ పందిరి గీత రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వార్డుల సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన పలు వినతిపత్రాలను ఆమె స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, జల సంచయ కార్యక్రమాలు, జల భగీరథ కింద రైన్వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, డ్రైనేజీల శుభ్రత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ, వీధి దీపాలు, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భూగర్భ జలాల సంరక్షణకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
నాలుగో వార్డులో ఉన్న డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు జేరిపోతుల సత్యనారాయణ, కోనేటి ఎల్లయ్య, కో-ఆప్షన్ సభ్యుడు సహజాది ఇబ్రహీం, సూపర్వైజర్ ధనలక్ష్మి, ప్రజలు పాల్గొన్నారు.
భవిష్యత్ తరాల కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి: చైర్మన్ గీత
