విద్యార్థులు, యువత ఆత్మహత్యలకు పాల్పడొద్దు

విద్యార్థులు, యువత ఆత్మహత్యలకు పాల్పడొద్దు

  • సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్

కడెం, ఆంధ్రప్రభ : యువత, విద్యార్థులు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా జీవించి లక్ష్యాలను సాధించాలని కడెం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ గుప్తా సూచించారు.

గురువారం కడెం మండల కేంద్రంలో జొన్నల చంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జేజేఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చీమల భీమేష్, ఉపాధ్యక్షుడు గౌసొద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్. రాజేష్‌కుమార్, కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్నలను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జొన్నల చంద్రశేఖర్ మాట్లాడుతూ, యువతకు మరియు విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, ఆత్మహత్యలు చేసుకోవద్దని అవగాహన కల్పిస్తున్న జేజేఎస్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.

జేజేఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చీమల భీమేష్ మాట్లాడుతూ, యువకులు తమ జీవితంలో ఎదురయ్యే కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే భవిష్యత్తులో ఎదురయ్యే అవరోధాలు, సవాళ్లను అధిగమించగలరని అన్నారు. జీవితంలో సమస్యలు సహజమేనని, వాటిని ఎదుర్కొనే మనోధైర్యం పెంపొందించుకోవాలని సూచించారు.

తమను సన్మానించిన కడెం మండల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు మరియు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.