From-June-12 : హమ్మయ్య,, ఇక కొత్త పెన్షన్లు Andhra Prabha Top News
From-June-12 : హమ్మయ్య,, ఇక కొత్త పెన్షన్లు Andhra Prabha Top News
- ఏపీ సర్కారు పచ్చజెండా
- జూన్ 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- మూడేళ్ల నిరీక్షణకు తెర
- పల్లెల్లో ఎన్టీఆర్ భరోసా సందడి
- వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు శుభవార్త
- ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- కొత్త పెన్షన్లకు అవసరమైన పత్రాలు ఇవే
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

From-June-12 : రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా కొత్త సామాజిక పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఎట్టకేలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. జూన్ 12వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించడంతో అర్హులలో ఆనందం వెల్లివిరుస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే ప్రజలు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఆరు నెలల పాటు కొత్త పెన్షన్ల మంజూరు నిలిచిపోయింది. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు.
From-June-12 : మూడేళ్లుగా నిరాశ.. నిస్పృహ
దీంతో దాదాపు మూడు సంవత్సరాలుగా కొత్తగా అర్హత సాధించిన వేలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు వెళ్లి ఎప్పుడు కొత్త పెన్షన్లు వస్తాయి?, ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటారు? అంటూ ప్రజలు తరచూ ఆరా తీశారు. కొందరు అర్హులు వయస్సు పెరిగినా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా కూపింఛన్ పథకానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది.
From-June-12 : కూటమి సర్కారే బెస్ట్

గత ప్రభుత్వంతో పోలిస్తే పెన్షన్ మొత్తాలను గణనీయంగా పెంచడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న రెండు నెలల బకాయిలను కూడా లబ్ధిదారులకు చెల్లించింది. ఈ నిర్ణయం పింఛన్ దారుల్లో విశేష ఆనందాన్ని కలిగించింది. అంతేకాకుండా ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే విధానాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయంగా గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు సచివాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితికి ముగింపు పలికింది. ముఖ్యంగా ప్రతి నెల మొదటి తేదీ ఆదివారం లేదా సెలవు దినం వచ్చినా లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
From-June-12 : తీరుతున్న ఆశలు

దీనివల్ల వృద్ధులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉపశమనం లభిస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో అందించిన పెన్షన్లతో పోలిస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ మొత్తాలు భారీగా పెరిగినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలకు ఈ పింఛన్లు ప్రధాన ఆర్థిక ఆధారంగా మారాయి. చిత్తూరు జిల్లాలోనే ప్రతి నెల కోట్ల రూపాయల మేర పెన్షన్ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. వేలాది మంది లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేయడం ద్వారా ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.
From-June-12 : అప్లికేషన్ కు ఇవి ఉండాలి
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. వితంతు పెన్షన్ కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళల పెన్షన్ కోసం సంబంధిత ధ్రువపత్రాలు, వికలాంగుల పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్, వృద్ధాప్య పెన్షన్ కోసం 60 సంవత్సరాలు నిండినట్లు ఆధారాలు అవసరమని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు స్పౌజ్ పెన్షన్ కింద మాత్రమే కొత్త మంజూర్లు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు సాధారణ అర్హుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పారదర్శకంగా అర్హుల ఎంపిక చేపట్టి నిజమైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ALSO READ : Amaravati-Health-Hub : ఇక అమరావతి జీహెచ్‌డీ Andhra Prabha Top News
