ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సహించం
ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సహించం
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ:
మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ అన్నారు.
సోమవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.
నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామాల్లోని రైతుల కల్లాల వద్దకు వెళ్లారని, అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారని చెప్పారు. రైతుల బాధను స్వయంగా చూసిన ప్రశాంత్ రెడ్డి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారని తెలిపారు.
ప్రశాంత్ రెడ్డి పనితీరును చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వరి రైతులకు మద్దతుగా మండుటెండలో రాస్తారోకో చేస్తేనే ప్రభుత్వం దిగివచ్చిందని, జిల్లా స్థాయి అధికారులు హామీ ఇచ్చిన తర్వాతే ధర్నా విరమించారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నాయకులు వరి రైతుల కల్లాల వద్దకు ఎప్పుడైనా వెళ్లారా అని దేవేందర్ ప్రశ్నించారు. ఆనాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాలు పేరుతో కడ్తా తీస్తే తోలు తీస్తానని చెప్పారని, ఇప్పుడు వరి కడ్తా ఎవరికీ చెందుతుందో మానాల మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులు ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్నారని, విత్తనాలు వేసే సమయం ఆసన్నమైందని అన్నారు. కరెంట్ కోతలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఖరీఫ్ సీజన్లో యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరారు. రైతులకు రుణమాఫీ చేయించి, రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మానాల మోహన్ రెడ్డికి లేదని దేవేందర్ అన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు రైతుల పంట కొనుగోలు కేంద్రాలకు వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకోవాలని సూచించారు.
బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వేముల ప్రశాంత్ రెడ్డిని విమర్శిస్తే నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కొత్తపల్లి హారిక అశోక్, సంతోష్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు గడ్డం స్వామి, దయ్య దేవయ్య, మాజీ ఎంపీటీసీ మైలారాం సుధాకర్ పాల్గొన్నారు. వీడీసీ చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్, ఏనుగు గంగారెడ్డి, రేంజర్ల మహేందర్, భాస్కర్, బద్దం రాజేశ్వర్, శ్రీను, సుంకరి మురళి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
