మీ భద్రత మా బాధ్యత”

- శ్రీ సిటీలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు
- శక్తి యాప్, 112, 1930, 181 సేవలపై చైతన్యం
- సైబర్ నేరాలు, పోక్సో చట్టం, రోడ్డు భద్రతపై సూచనలు
తిరుపతి, ఆంధ్రప్రభ : మహిళల రక్షణ, భద్రత, సాధికారత లక్ష్యంగా శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఐఎల్ ఇండియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో “మీ భద్రత మా బాధ్యత” అనే సందేశంతో మహిళా ఉద్యోగులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
శ్రీ సిటీ డీఎస్పీ శ్రీనివాసులు, శ్రీ సిటీ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం. ప్రియాంక పాల్గొని మహిళల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112, శక్తి యాప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిరోధం, పోక్సో చట్టం, మహిళల హక్కులు, రోడ్డు భద్రత, కుటుంబంలో తల్లిదండ్రుల బాధ్యతలపై అవగాహన కల్పించారు.
మహిళలు వేధింపులు, అన్యాయాలు లేదా అసౌకర్య పరిస్థితులు ఎదురైన వెంటనే పోలీసులను లేదా సంబంధిత సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించాలని సూచించారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, మహిళా సాధికారత సమాజ అభ్యున్నతికి పునాది అని పేర్కొన్నారు.
అనంతరం సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం. ప్రియాంక మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన శిక్షలు, వ్యక్తిగత భద్రత, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాల నివారణ, శక్తి యాప్, డయల్-112, సైబర్ హెల్ప్‌లైన్ 1930, మహిళా హెల్ప్‌లైన్ 181 సేవల వినియోగంపై కూడా సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్యం, మహిళా ఉద్యోగులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
