ఈ-సైకిళ్లతో పర్యావరణ పరిరక్షణ

  • వాయు కాలుష్య నియంత్రణకు ఉత్తమ ప్రత్యామ్నాయం
  • యువత, ఉద్యోగులు ముందుకు రావాలి
  • ఈ-సైకిల్ వినియోగిస్తున్న సిబ్బందికి కలెక్టర్ అభినందనలు

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఈ-సైకిళ్ల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి సుశీల దేవితో కలిసి ఆయన ఈ-సైకిల్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-సైకిల్ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై మరింత చైతన్యం కలుగుతుందని అన్నారు. పెరుగుతున్న వాహనాల వినియోగంతో వాయు కాలుష్యం అధికమవుతోందని, ఇ-సైకిళ్ల వినియోగం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన వ్యయాన్ని కూడా ఆదా చేయవచ్చని తెలిపారు.

పర్యావరణ హిత రవాణా వ్యవస్థలను ప్రోత్సహించడం ద్వారా భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇ-సైకిళ్ల వినియోగానికి ముందుకు రావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే కార్యక్రమాలను పంచాయతీ రాజ్ శాఖ నిరంతరం చేపడుతోందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ఇ-సైకిళ్ల వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కలెక్టర్ కోరారు. ఈ-సైకిల్‌ను వినియోగిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ సిబ్బందిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply