ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన..!

ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన..!
- రూ. 112.14 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
- “ఇందిరమ్మ” రెండో విడత పైలాన్ ఆవిష్కరణ..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం పర్యటన షెడ్యూల్ స్వల్ప మార్పులతో ఖరారైంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రెండో విడత ఇందిరమ్మ గృహాల మంజూరీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు.

ఆదివాసి గిరిజనుల సమస్యలపై వారితో నేరుగా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నారు. మొత్తం రూ.112.14 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

మారుమూల గిరిజన గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 13 జిల్లాల నుండి సుమారు 1000 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..
- సాయంత్రం 4.40 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి కెరమెరి మండలం కొఠారి గ్రామానికి చేరుకోనున్నారు.
- సాయంత్రం 5.45 గంటలకు 26 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు.
- సాయంత్రం 6.30 వరకు ఆదివాసి గిరిజన లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు.
- సాయంత్రం 6.55కు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు.
- 6.55 నుంచి 7 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
- 7 గంటల నుంచి 8.30 వరకు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
- రాత్రి 8.30కు రోడ్డు మార్గంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ ఇంటికి చేరుకుంటారు.
- రాత్రి 10 గంటలకు అక్కడే బస చేసి, అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు.

