ప్రశ్నిస్తే కేసులు పెడతారా..

ప్రశ్నిస్తే కేసులు పెడతారా..

  • రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం,
  • బి ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యలమద్ది రవి

ఇల్లెందు, ఆంద్రప్రభ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదులపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు యలమద్ది రవి ఘాటుగా స్పందించారు.

ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, అయితే ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, ఎక్కడా కుల ప్రస్తావన లేని అంశాలపై కూడా బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించడం సమంజసం కాదని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తే తమ ఉనికి కోల్పోతామన్న భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ సోషల్ మీడియా నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన ప్రెస్ నోట్లలో ఎక్కడా కుల ప్రస్తావన లేకపోయినా, ఎస్సీ, ఎస్టీ కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు.

అధికారం ఎవరికి శాశ్వతం కాదని, రాజకీయాల్లో విమర్శలకు విమర్శలతోనే సమాధానం చెప్పాలని, కానీ అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రశ్నించే గొంతులను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

ఇల్లెందు నియోజకవర్గంలో 2014 నుంచి 2023 వరకు జరిగిన అభివృద్ధి అంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని యలమద్ది రవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇల్లెందు ప్రాంతం అభివృద్ధి గురించి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే అది బీఆర్ఎస్ పాలనలో జరిగిన పనుల ఫలితమేనని అన్నారు.

గత రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇల్లెందు నియోజకవర్గానికి ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం తప్ప కొత్తగా తీసుకొచ్చిన నిధులు, చేపట్టిన పనులు ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ప్రజలు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులను కేసులతో వేధించే ప్రయత్నాలను ప్రజలు సహించరని అన్నారు. అధికారం, పదవులు శాశ్వతం కాదని, ఇలాంటి రాజకీయ కక్షసాధింపు చర్యలను మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భవిష్యత్తులో మళ్లీ గులాబీ జెండా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply