పెండింగ్ బకాయిల కోసం పోరాటం.. మాజీ సర్పంచుల అరెస్టు

నర్సంపేట, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధికి పాటుపడిన మాజీ సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మాజీ సర్పంచుల అందరిని ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. నర్సంపేటలో మాజీ సర్పంచుల బకాయిల చెల్లింపుల కోసం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న నాయకుల అరెస్టులను బీఆర్‌ఎస్ నాయకులు ఖండించారు. నర్సంపేట మండలంలోని మాజీ సర్పంచులను అరెస్టు చేసి సోమవారం ఉదయం నర్సంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొండి చేయి చూపుతున్నారని మాజీ సర్పంచులు ఆరోపించారు. మూడేళ్లు గడిచినా మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఒక్కొక్క సర్పంచ్ కి 7 లక్షల నుంచి 15 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉందని మాజీ సర్పంచ్లు తెలిపా రు. అరెస్టు అయిన మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొడారీ రవి, మాజీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, దస్రు నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, గుడిసెల రాంబాబు తదితరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.
